Weather Report : నేడు కూడా వర్షాలేనట.. ఈదురుగాలుల తప్పవట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో నేడు కూడా ఎండలతో పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది.;

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో నేడు కూడా ఎండలతో పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఒకవైపు ఎండలు, మరొక వైపు వర్షాలతో వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పశువుల కాపర్లు, రైతులు పొలాల్లో చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చెట్ల కింద ఉంటే పిడుగు పాటుకు గురయ్యే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.
ఎండల తీవత్ర కూడా...
మరొకవైపు ఎండల తీవ్రత కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలతో పాటు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులతో పాటు ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వడగళ్లు కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశముందని కూడా పేర్కొంది. ప్రధానంగా రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏపీ విపత్తు నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా నమోదవుతాయని తెలిపింది.
తెలంగాణలోనూ...
తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షపాతం కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల పరిధిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ నెల ఐదో తేదీ నుంచి మాత్రం ఎండలు దంచి కొడతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నలభై డిగ్రీలకు పైగానే ఐదో తేదీ నుంచి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఎండలైనా.. వర్షమైనా.. ప్రజలు మాత్రం ఇక అలెర్ట్ గా ఉండాల్సిందే.