Telangana : అంతా ఆయనే చేశాడు.. ధర్మరాజు కాదు.. ఆయన దృతరాష్ట్రుడు
మంత్రి వర్గ విస్తరణ జరగకపోవడానికి, తనకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం జానారెడ్డి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు;

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే కొనసాగుతుంటాయి. కూల్ గా సరదాగా సాగితేనే ఆశ్చర్యపోవాలి. తప్పించి నేతల మధ్య ఆరోపణలు రావడం ఎప్పుడూ మామూలే. కాంగ్రెస్ కూడా వీటిని పెద్దగా పట్టించుకోదు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోకి చెందినవే. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, తనకు మంత్రి పదవి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టిగా నమ్మారు. అంతేకాదు ఒక అడుగు ముందుకేసి తనకు హోంశాఖ అంటే ఇష్టమని కూడా ఆయన మీడియాతో అన్నారంటే కోమటిరెడ్డి ఎంత కాన్ఫడెన్స్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఏప్రిల్ 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని భావించినా అది జరగలేదు.
మంత్రివర్గ విస్తరణ జరగకపోవడానికి...
అయితే మంత్రి వర్గ విస్తరణ జరగకపోవడానికి, తనకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం జానారెడ్డి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాంబు పేల్చారు. జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాలు మొత్తం మూడు గ్రూపులుగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ను శాసిస్తున్నాయి.ముగ్గురు సీనియర్ నేతలు, ముగ్గురు కాంగ్రెస్ లో కీలక నేతలు కావడంతో అధికారంలోకి వస్తే ఈ జిల్లా నుంచి ముగ్గురు మంత్రి వర్గంలోకి రావడం గ్యారంటీ. అయితే ఈసారి జానారెడ్డి ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఆయన కుమారుడు పోటీ చేసి విజయం సాధించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే కేబినెట్ లో ఉన్నారు. అయితే మూడో మంత్రి పదవి అదే జిల్లాకు చెందిన, ఒకే సామాజికవర్గానికి చెందిన నేతకు ఇవ్వడంపై అనేక విమర్శలు తలెత్తాయి.
ఎన్నికలకు ముందు...
గత ఎన్నికలకు ముందు తాను కాంగ్రెస్ లోకి రావడానికి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న సోదరుడు వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా తన పదవికి ఢోకా ఉండదని ఆయన ధీమాగా ఉన్నారు. కానీ జానారెడ్డి రాసిన లేఖతో తనకు మంత్రి పదవి పెండింగ్ లో పడిపోయిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. అదే విషయాన్ని మీడియాకు బహిరంగంగానే చెప్పారు. నిజానికి జానారెడ్డి అధినాయకత్వానికి లేఖ రాశారు. కానీ అందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించాలని మాత్రమే రాశారు.
మంత్రి పదవి రాకుండా...
కానీ తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకే జానారెడ్డి ఈ లేఖను రాశారంటూ జానారెడ్డిపై ఫైర్ అయ్యారు. అధినాయకత్వం తనకు మంత్రి పదవి ఇవ్వాలని భావించినా కొందరికి చెమటలు పడుతున్నాయని, ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి దృతరాష్ట్రుడిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడింది జానారెడ్డి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పదవిని అడుక్కునే పరిస్థితుల్లో తాను లేనని, తననుచూసి అందరూ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని, అన్నదమ్ములకు మంత్రిపదవి ఇస్తే తప్పేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇకరాదని తేలిపోయినట్లేనని కాంగ్రెస్ నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.