SLBC Accident : రిస్క్ చేయలేక.. రెస్క్యూ ఆపరేషన్ సాగుతుంది ఇలా?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో సహాయక చర్యలు నలభై రోజులకు చేరుకున్నాయి;

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో సహాయక చర్యలు నలభై రోజులకు చేరుకున్నాయి. కన్వేయర్ బెల్ట్ సమీపంలోనే మృతదేహలున్నట్లు గుర్తించినప్పటికీ వాటిని వెలికి తీయడంలో మాత్రం సఫలం కావడం లేదు. రిస్కీ ఆపరేషన్ కు సహాయక బృందాలు మొగ్గు చూపడం లేదు. టన్నెల్ లో పేరుకుపోయిన బురదను, మట్టిని తరలించిన తర్వాత తవ్వకాలు జరపాలనుకున్నప్పటికీ అక్కడ ప్రమాదకరంగా పరిస్థితులున్నాయని అధికారులు సయితం గుర్తించారు. అక్కడ మిషన్లు తప్ప కార్మికులు తవ్వకాలు జరిపే పరిస్థితి లేదని వారు ఒక అంచనాకు వచ్చారు.
ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో...
ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి శివశంకర్ ప్రతి రెండు గంటలకు ఒకసారి సమీక్ష చేస్తూ సహాయక బృందాలకు గైడెన్స్ ఇస్తున్నారు. వారు డేంజర్ జోన్ కు వెళ్లి వెనక్కు తిరిగి వస్తున్నారు. అక్కడ పైకప్పు విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన సహాయక బృందాలు అటు వైపు వెళ్లడం మానుకున్నాయి. దాని ముందు వరకు వెళ్లి పరిస్థితిని గమనించి వెనక్కు తిరిగి వస్తున్నారు. మృతదేహాలు లభ్యమయ్యేంత వరకూ ఆపరేషన్ కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలతో సహాయక బృందాలు అక్కడే ఉన్నాయి.
మరో ఆరు మృతదేహాల కోసం...
మరో ఆరు మృతదేహాలు బయటకు తీయాల్సి ఉంది. అయితే ఇప్పుడు నలభై రోజులు గడవటంతో మృతదేహాలు ఏ పరిస్థితుల్లో ఉంటాయో కూడా చెప్పలేమని అంటున్నారు. కనీసం వారి ఆనవాళ్లు దొరికినా చాలు.. మృతుల బంధువులకు ఇచ్చి తర్వాత పరిస్థితిని ప్రభుత్వ అనుమతితో ముందుకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నా ఇప్పటి వరకూ వాటి జాడ లేకపోవడంతో ఉసూరుమంటున్నాయి. సహాయక బృందాలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నా ఎలాంటి పురోగతి లభించకపోవడంతో ఇంకా ఎన్నాళ్లు పడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.