SLBC Accident : మృతదేహాలు అసలు దొరికే ఛాన్స్ ఉందా?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.;

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేటికి సహాయక చర్యలు నలభై రెండు రోజులకు చేరాయి. అసలు ఆరు మృతదేహాలు దొరకుతాయా? లేదా? అన్నది కూడా అనుమానం తలెత్తుతుంది. నలభై రెండు రోజులు కావడంతో మృతదేహాల అవశేషాలు కూడా ఇక దొరకడం దుర్లభమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అసలు తవ్వకాలు జరిపినా కూరుకుపోయిన మృతదేహాలు లభ్యమవుతాయని మాత్రం పూర్తి స్థాయిలో ఎవరూ గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే పరిస్థితిని అర్థం చేసుకున్న నిపుణులు చెప్పే మాటలివి.
మృతదేహాలు ఇన్ని రోజులు కావడంతో...
మృతదేహాలు ఇప్పటికే కళేబరాలుగా మారిపోయి ఉంటాయని, ఎముకల గూడు తప్ప మరేమీ మిగలదని, ఇన్ని రోజులు కావడంతో అవి కూడా లోతులో ఉన్న వాటిని వెలికి తీయడం కష్టమేనన్న అభిప్రాయం సహాయక బృందాల్లో వ్యక్తమవుతుంది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించినా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మృతదేహాలు కానీ, అవశేషాలు కానీ లభ్యమయ్యేంత వరకూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని చెప్పడంతో తప్పని సరి పరిస్థితుల్లో పన్నెండు బృందాలు నేటికీ గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
టన్నెల్ లోపల...
టన్నెల్ లోపల ప్రమాదకర పరిస్థితులు ఉండటంతో పాటు నీరు ఉబికి వస్తుండటం కూడా సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. పేరుకుపోయిన బురదను తోడటం కష్టంగా మారింది. మరొక వైపు టన్నెల్ లోపు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇబ్బంది కరమైన పరిస్థితులు ఉండటంతో సహాయక బృందాలు కూడా ఏమీ చేయలేని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. ఎంతటి విపత్తులోనైనా ఇంత జాప్యం జరగదని, ఇక్కడ పరిస్థితులు ప్రత్యేకంగా ఉండటంతో నెలన్నర పైగానే సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. చివరి వరకూ తమ విధులు నిర్వహిస్తామని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. మొత్తం మీద ఎప్పటికి ఇది పూర్తయి మృతదేహాల జాడ దొరుకుతుందన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.