SLBC Accident : టన్నెల్ లో తాజా అప్ డేట్ ఏంటంటే? ముగింపుకు వచ్చినట్లేనా?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి;

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. నేటికి సహాయక చర్యలు ప్రారంభమై 48 రోజులవుతుంది. అయినప్పటికీ ఇప్పటి వరకూ ఆరు మృతదేహాల జాడ మాత్రం తెలియరాలేదు. టన్నెల్ లో పనులు చేయడం కోసం ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన యాభై మంది కార్మికులతో పాటు ఇంజినీర్లు యాభై మంది లోపలకి వెళ్లారు. అయితే ఆ సమయంలో ప్రమాదం జరగడంతో పాటు పై కప్పు కూలడంతో ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు. మిగిలిన వారు ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఇందులో గురుప్రీత్ సింగ్, మనోజ్ కుమార్ మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.
పన్నెండు బృందాలు...
మిగిలిన ఆరుగురి మృతదేహాల కోసం గత కొద్దిరోజులుగా అన్వేషణ కొనసగుతుంది. పన్నెండు సంస్థలకు చెందిన రెస్క్యూ సిబ్బంది మూడు షిఫ్ట్ లలో నిరంతరం పనిచేస్తున్నారు. వీరికి జిల్లా యంత్రాంగంతో పాటు సిబ్బంది కూడా సహకరిస్తున్నారు. ఎలాగైనా మృతదేహాలను వెలికి తీసి బంధువులకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్ లో ఉన్న ప్రమాదకరమైన పరిస్థితులతో పాటు వివిధ రకాల ఆటంకాలు ఎదురవుతుండటంతో అడ్డంకిగా మారుతుందని సహాయక బృందాలు చెబుతున్నాయి. అనేక సమస్యలు నిత్యం ఎదురవుతున్నప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో సహాయక బృందాలు మృతదేహాల వెలికితీతనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాయి.
నిత్యం సమీక్ష చేస్తూ...
ప్రభుత్వం ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేక అధికారిగా శివశంకర్ ను నియమించింది. ఒకవైపు సహాయక బృందాలను సమన్వయం చేసుకుంటూ మరొక వైపు ప్రభుత్వంతో నిత్యం చర్చలు జరుపుతూ తగిన సూచనలు చేస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి సహాయక చర్యల్లో వేగం పెరిగినట్లు ప్రత్యేక అధికారి శివ శంకర్ తెలిపారు. ఎంత ఖర్చయినా సరే మృతదేహాలు లభ్యమయ్యేంత వరకూ సహాయక చర్యలు కొనసాగుతాయని తెలిపారు. బంధువులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మృతదేహాలను త్వరలోనే వారికి అప్పగించేందుకు తాము నిరంతరం ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.