ఈ వార్తలు చదువుతుంటే నవ్వురావడం లేదా?

బహిరంగసభలకు జనాలను తరలిస్తున్నారని ఒక పార్టీపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరి మీడియాలో వారు ప్రచారం చేసుకుంటున్నారు

Update: 2022-12-20 08:43 GMT

నిజమే.. కొన్ని వార్తలు చదువుతుంటే నవ్వు తెప్పిస్తాయి. ప్రత్యక్షంగా చూసిన వారయితే పడీ పడీ మరీ నవ్వుకోవాల్సి వస్తుంది. "జగన్ సభలకు వెళ్లిపోతున్న జనం" చంద్రబాబు సభలకు పోటెత్తుతున్న ప్రజలు" ఇవి ఒక వర్గం మీడియాలో. మరొక వర్గం మీడియాలో దీనికి భిన్నంగా వార్తలు దర్శనమిస్తాయి. అసలు ఈ కాలంలో స్వచ్ఛందంగా సభలకు వచ్చి నేతల మాటలు వింటారా? అన్నది పెద్ద సందేహం. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్, ఇందిరాగాంధీలను చూసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సభలకు తరలి వచ్చేవారు. ఎప్పుడూ పెద్దగా రాష్ట్రానికి రారు కాబట్టి ఇందిరాగాంధీని చూసేందుకు, సినిమాల్లో చూసిన ఎన్టీఆర్ ను ప్రత్యక్షంగా చూసేందుకు జనం స్వచ్ఛందంగానే తరలి వచ్చేవారు. వారి రాకకోసం ఎదురు చూసేవారు.

నాడు అలా కాదు...
అంతేకాదు ఆ ఇద్దరు నేతలు మంచి వక్తలు. ఇందిర హిందీలో మాట్లాడినా, ఎన్టీఆర్ తెలుగులో మాట్లాడిన అలవోకగా ప్రసంగాలు సాగేవి. వారి ప్రసంగం వినడానికి కూడా ఎంతో మంది తరలి వచ్చేవారు. ఆరోజు ఇంత మీడియా లేదు. టీవీలు ఉన్నా ఇంతమందికి అందుబాటులో లేదు. ఇన్ని న్యూస్ ఛానెళ్లు లేవు. అందుకే ప్రత్యక్షంగా వారిని చూసి ప్రసంగాలు చూసేందుకు జనం ఎగబడేవారు. ఎవరికి వారే తరలి వచ్చారు. ఎన్టీఆర్ ను చూసేందుకు అయితే చద్ది మూటలు కట్టుకుని, ఎడ్లబండలపైన వచ్చి రోజంతా ఆయన కోసం ఎదురు చూసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
పసలేని ప్రసంగాలే...
కానీ ఇప్పుడలా కాదు. ఇప్పటి రాజకీయ నేతల ప్రసంగాలు ఎప్పటికప్పుడు లైవ్ లో టీవీలో వస్తున్నాయి. నేరుగా అక్కడకు వెళ్లకపోయినా ఇంట్లో కూర్చోనో.. మొబైల్ లోనో ఎక్కడి నుంచైనా చూసే వీలుంది. దీంతో పాటు ఇప్పటి నేతల ప్రసంగాలు వినేటంత గొప్పవేమీ కావు. చంద్రబాబు కాని.. జగన్ కాని.. పవన్ కాని.. చేసేవి పసలేని ప్రసంగాలే. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మినహా పెద్దగా సబ్జెక్ట్ లేని ప్రసంగాలు ఎక్కువగా వినిపిస్తాయి. పెద్దగా కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. దీంతో వారి సభలకు స్వచ్ఛందంగా వచ్చే వారు ఎవరూ ఉండరు.

జనసమీకరణ చేయకుంటే...
ఏ పార్టీ అయినా అందరూ తరలించనిదే జనం వీళ్ల సభలకు రారన్న సంగతి అందరికీ తెలుసు. కాకుంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాబట్టి కొంత కసితో నేతలు జనసమీకరణ చేస్తారు. అధికారంలో ఉన్న వైసీపీకి మాత్రం ప్రభుత్వ అధికారులే డ్వాక్రా మహిళలనో, మరొకరినో తెచ్చి ప్రాంగణాన్ని నింపుతారు. పవన్ కల్యాణ్ విషయానికి వస్తే కొంత మినహాయింపు ఇవ్వొచ్చు. ఆయన సినీ హీరో కావడంతో ఒకసారి చూసి వెళదామని వచ్చే వారు ఎక్కువగా ఉంటారు. అంతే తప్ప జనసేన నేతలు కూడా జనసమీకరణ చేయనిది ఎక్కువ సంఖ్యలో రారన్నది కూడా అంతే నిజం. మొత్తం మీద ఏ పార్టీకి అనుకూలమైన మీడియా ఆ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసుకోవడం తప్ప జనం వీరి సభలకు వచ్చేది అనడం ట్రాష్. అందరూ జనసమీకరణ చేయాల్సిందే. వాహనాలను పెట్టి తోలాల్సిందే.


Tags:    

Similar News