TDP : ఎన్టీఆర్ కుటుంబమే కాదు.. ఈ కుటుంబాల్లోనూ నలుగురు ఎన్నికయ్యారుగా
ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఐదుగురు గెలిచారు. టీడీపీ నుంచి మరోకుటుంబంలోని నలుగురు సభ్యులు కూడా గెలిచారు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఐదుగురు గెలిచారు. ముగ్గురు అసెంబ్లీకి, ఇద్దరు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అదే సమయంలో మరోకుటుంబంలోని నలుగురు సభ్యులు కూడా ఈసారి ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లోకి అడుగుపెడుతున్నారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి అత్యధిక సంఖ్యలో ఈసారి చట్ట సభల్లో అడుగుపెడితే అదే సమయంలో మాజీ కేంద్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కుటుంబానికి చెందిన నలుగురు కూడా చట్టసభల్లో అడుగుపెట్టారు.
కింజారపు కుటుంబంలో...
కింజారపు అచ్చెన్నాయుడు టెక్కలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ఎర్రన్నాయుడు కుమారుడు కింజారపు రామ్మోహన్ నాయుడు మూడోసారి శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. ఆయన చిన్న వయసులోనే ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. ఇక ఎర్రన్నాయుడు కుమార్తె భవానీ భర్త ఆదిరెడ్డి వాసు రాజమండ్రి పట్టణ అసెంబ్లీ నుంచి ఎన్నికయ్యారు. దీంతో పాటు రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణ మూర్తి మాడగుల అసెంబ్లీ నుంచి ఎన్నికయ్యారు. దీంతో ఒకే కుటుంబం నుంచి నలుగురు సభ్యులు ఎన్నికయినట్లయింది.
యనమల కుటుంబంలో...
ఇక మరో కుటుంబం నుంచి కూడా నలుగురు చట్టసభల్లో ఉన్నారు. అది యనమల కుటుంబం. యనమల రామకృష్ణుడు ఇప్పటికే శాసనమండలిలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన కుమార్తె దివ్య తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో పాటు యనమల రామకృష‌్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. ఇక పుట్టా సుధాకర్ యాదవ్ యనమల వియ్యంకుడు ఆయన మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా నలుగురు గెలిచి ఎన్టీఆర్ కుటుంబంతో పోటీ పడినట్లయింది.