Chandrababu Naidu : ప్రత్యేకహోదా సాధించుకునేందుకు ఇదే అసలు సమయం.. అదే జరిగితే ఇక తిరుగుండదుగా?

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు దేశ రాజకీయాల్లో కీలకంగా మారారు.

Update: 2024-06-05 07:36 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు దేశ రాజకీయాల్లో కీలకంగా మారారు. ఎన్డీఏలో అతి పెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది. దీంతో అనేక దీర్ఘకాలిక సమస్యలకు ఈ ఎన్నిక ఫుల్‌స్టాప్ పెడుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలనుకున్నా, మరికొన్ని ఎన్నికల్లో తాను అలవోకగా విజయం సాధించాలనుకున్నా చంద్రబాబుకు టైం కలసి వచ్చింది. అంతా ఆయన అనుకున్నట్లు జరిగితే పెద్దగా ఇబ్బంది పడకుండానే ఆయన సునాయాసంగా మరోసారి ఎన్నికల్లో గట్టెక్కే అవకాశాలున్నాయన్న అంచనాలు వినపడుతున్నాయి. అందుకు సరిపడా సంఖ్య బాబు ఖాతాలో ఉంది. అదే ఆయనకు కలసి వచ్చే అంశంగా చెప్పాలి.

అరకొర సీట్లతోనే...
ఎన్డీఏలో ఇప్పుడు టీడీపీ అతి పెద్ద పార్టీ. జనసేనతో కలుపుకుని మోదీ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే అవకాశముంది. బీజేపీికి కేంద్రంలో అరకొరగానే సీట్లు వచ్చాయి. సొంతంగా అధికారంలోకి రాలేకపోయింది. 2014, 2019 ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడోసారి మాత్రం సీట్లు తగ్గాయి. కేవలం 240 సీట్లకు మాత్రమే పరిమితమయింది. అంటే మిత్రపక్షాల మద్దతుతోనే అది ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మోదీ ప్రభుత్వం కొంత మిత్రుల డిమాండ్ కు దిగి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. లేకుంటే ప్రభుత్వం కూలిపోయే అవకాశముంది. టీడీపీ, జనసేనకు పదహారు స్థానాలుండటంతో కీలకంగా మారాయి. అందుకే ఇప్పుడు మోదీ వీరి మాటను చెవికెక్కించుకుంటారు.
తలూపాల్సిందే...
అంతే కాదు చెప్పినట్లు తలాడించక తప్పని పరిస్థితి. గతంలో మాదిరి తలూపితే కుదరదు. బతిమాలాడాల్సిన పరిస్థిితి లేదు. బ్లాక్ మెయిల్ కాదు కానీ.. డిమాండ్ చేసే పరిస్థితి అయితే మాత్రం ఉంది. మోదీ ప్రభుత్వాన్ని ఇప్పుడే వంచాల్సిన అవసరం కూడా ఏపీ నేతలకు ఉందన్న కామెంట్స్ బాగా వినపడుతున్నాయి. ఈ సమయం మరొకసారి రాదు. మరెవ్వరికీ ఇంతటి అవకాశం దక్కదు. ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలన్న సామెతగా మోదీని మెప్పించి, ఒప్పించేందుకు ఇందుకు సరైన సమయం అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడంలో ఎలాంటి రాజీ పడకపోతే సులువుగానే అధిగమించే అవకాశముంది.
ప్రత్యేక హోదా...
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది దీర్ఘకాలిక కల. అది కలగానే మిగిలిపోయింది. ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ఇంతకు మించి అవకాశం లేదు. సమయం మించి పోతే చేజారి పోతుంది. అందుకే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు మోదీని ఒప్పించడానికి పెద్ద సమయం కూడా పట్టదు. మోదీ దిగిరాక తప్పదు. కేవలం ప్రత్యేక హోదా మాత్రమే కాదు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు విడుదల, అమరావతి నిర్మాణంలో కూడా కేంద్రం నుంచి సాయాన్ని భారీగానే ఆశించవచ్చు. అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం.


Tags:    

Similar News