Visakha : విశాఖ పార్లమెంటు సీటు ఈసారి కూడా టీడీపీకి అంత ఈజీ కాదు త‌మ్ముడూ

విశాఖ పార్లమెంటు స్థానంలో ఈసారి కూడా టీడీపీ గెలవడం అంత సులువు కాదంటున్నారు విశ్లేషకులు

Update: 2024-05-11 12:27 GMT

విశాఖ ప‌ట్నం పార్లమెంటు స్థానం ఈ ద‌ఫా టీడీపీకే ద‌క్కుతుంద‌ని పేర్కొంటూ.. కొన్ని అనుకూల వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో వాస్త‌వ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. టీడీపీకి గ‌ట్టి పోటీతోపాటు.. ఎదురీత కూడా త‌ప్పడం లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ ర్గాల‌ను ప‌రిశీలిస్తే.. ఆయా స్థానాల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య తీవ్ర పోరాటం జ‌రుగుతోంది. కొన్ని కోన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే.. అస‌లు ఫైట్ ఓ రేంజ్‌లో సాగుతోంది. దీంతో విశాఖ పార్లమెంటు స్థానాన్ని టీడీపీ ద‌క్కించుకోవ‌డం అంత ఈజీ కాద‌నే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది.వాస్త‌వానికి టీడీపీ ఇక్కడ బ‌లమైన ఆశ‌లే పెట్టుకుంది. జ‌న‌సేన‌-బీజేపీల‌కు ఉన్న బ‌లం త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని.. ఎలానూ త‌మ‌కు న‌గ‌ర ప‌రిధిలోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌ట్టున్న ద‌రిమిలా.. త‌మ అభ్యర్థి శ్రీభ‌ర‌త్ గెలుపు సునాయాశం అవుతుంద‌ని లెక్కలు వేసుకుంది.

టఫ్ ఫైట్ ...
అయితే.. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి చాలా త‌క్కువగా ఉంద‌ని తెలుస్తోంది. దీనికి కార‌ణం.. బ‌ల‌మైన అభ్యర్థుల‌ను వైసీపీ ఎంచుకోవ‌డంతోపాటు.. విశాఖ నుంచి మ‌హిళా నాయ‌కురాలు.. వివాద‌ర‌హిత బొత్స ఝాన్సీని నిల‌బెట్టడం. దీంతో ఈ సీటు ట‌ఫ్‌గా మారిపోయింది.ఈ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గాజువాక‌, విశాఖ తూర్పు, ద‌క్షిణ‌, ప‌శ్చిమ‌, విశాఖ ఉత్తరంతోపాటు.. శృంగ‌వ‌ర‌పు కోట‌, భీమిలి నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో ఫైట్ హోరా హోరాగా సాగుతోంది. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే.. ఏ స‌ర్వేకూ అంద‌నంత ట‌ఫ్ ఫైట్ సాగుతోంది. దీంతో టీడీపీ పెట్టుకున్న అంచ‌నాలు అంత ఈజీగా స‌క్సెస్ అవుతాయ‌ని చెప్పలేని ప‌రిస్థితి ఏర్పడింది. గ‌త ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. నాలుగు స్థానాల్లో టీడీపీ విజ‌యంద‌క్కించుకున్నా.. భీమిలి, గాజువాక‌, ఎస్‌. కోట నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చిన మెజారిటీతో వైసీపీ ఎంపీ సీటును ద‌క్కించుకుంది. ఇప్పుడు ఆ నాలుగు న‌గ‌ర ప‌రిధిలోని సీట్లలోనూ వైసీపీ బ‌లంగా పోరాడుతోంది. దీంతో టీడీపీ గెలుపుపై అంచ‌నాలు మ‌రీ అంత వ‌న్‌సైడ్‌గా అయితే లేవు.
టీడీపీ అంచ‌నాలు ఇవీ..
టీడీపీ వాస్తవానికి విశాఖ‌పై చాలానే అంచనాలు పెట్టుకుంది. ఇక్కడ నుంచి వ‌రుస‌గా శ్రీభ‌ర‌త్‌ను రంగంలోకి దింప‌డంతో .. ఆయ‌న‌పై సానుభూతి పెరుగుతుంద‌ని అంచనా వేసుకుంది. అదేవిధంగా నార్త్ నియోజ‌క‌వ‌ర్గంలో నార్త్ ఇండియ‌న్స్ ఎక్కువ‌గా ఉన్నార‌ని వారు త‌మ‌కే అనుకూల‌మ‌ని లెక్కలు వేసుకుంది. ఇక‌, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని భావించింది. దీంతో బొత్స ఝాన్సీ అస‌లు పోటీ ఇచ్చే ప‌రిస్థితి కూడా లేద‌న్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ప‌రిస్థితి వేరుగా ఉండ‌డంతో సీన్ మారిపోయింది.

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా..
విశాఖ నార్త్‌: గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచిన ఈ సీటు.. ఇప్పుడు ట‌ఫ్ అయింది. బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు బ‌రిలో ఉన్నారు. వైసీపీ నుంచి కేకే రాజు ఉన్నారు. వీరిద్దరి మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఎవ‌రు గెలిచినా... నామ‌మాత్రపు మెజారిటీనే వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. పైగా గ‌త ఎన్నిక‌ల్లోనే అప్పటి మంత్రి టీడీపీ గంటాను ఓట‌మి అంచుల వ‌ర‌కు తీసుకువెళ్లిన కెకె. రాజు ఓడిపోయినా నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగేళ్ల పాటు ప్రజ‌ల్లోనే ఉంటూ మంచి ప‌ట్టు తెచ్చుకుని ఈ రోజు గెలుస్తాడ్రా అనే మౌత్ టాక్ వ‌ర‌కు వ‌చ్చేశాడు.
విశాఖ తూర్పు: ఇది టీడీపీకి వ‌రుస విజ‌యాలు అందిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం. వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎంపీ ఎంవీవీ స‌త్యనారాయ‌ణ బ‌రిలో ఉన్నారు. ఇద్దరి మ‌ధ్య పోరు తీవ్రంగానే ఉంది. ఏక‌ప‌క్షం అనుకునే ప‌రిస్థితి లేనేలేదు. దీంతో వెల‌గ‌పూడి గెలిచే ఛాన్స్ ఉన్నా.. మెజారిటీ మాత్రం నామ‌మాత్రంగానే ఉండ‌నుంది. ఇక్కడ ఎంవీవీ ఎనిమిది నెల‌ల నుంచి గ్రౌండ్‌లో తిరుగుతూ ఆర్థికంగా గ‌ట్టిగా ఖ‌ర్చు పెడుతున్నారు. వెల‌గ‌పూడి గెలుపు ధీమాతో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చాక బ‌య‌ట‌కు వ‌చ్చారు.
విశాఖ ద‌క్షిణం: వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ బ‌రిలో ఉన్నారు. ఈయ‌న‌పై జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు.. వంశీ కృష్ణ యాద‌వ్ బ‌రిలో ఉన్నారు. ఇద్దరూ కూడా తీవ్రంగా ఫైట్ చేస్తున్నారు. అన్ని స‌ర్వేలు వంశీ గెలుపు ఏ మాత్రం సులువు కాద‌ని చెపుతున్నాయి. వాసుప‌ల్లి మాస్ లీడ‌ర్‌.. పైగా వంశీది తూర్పు నియోజ‌క‌వ‌ర్గం. ఆయ‌న ద‌క్షిణంలో పోటీ చేయ‌డం.. ఇక్కడ టీడీపీ కేడ‌ర్ కూడా అంత‌గా స‌పోర్ట్ చేయ‌క‌పోవ‌డంతో వంశీ ఏటికి ఎదురీదుతోన్న ప‌రిస్థితి.
విశాఖ ప‌శ్చిమ‌: టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ గ‌ణ‌బాబు, అడారికి మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంది. సో.. ఈ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు మూడు సీట్లను వైసీపీ ద‌క్కించుకున్నా ఆశ్చర్యం లేదనే టాక్ వినిపిస్తోంది.
భీమిలి: మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు గెలుస్తార‌ని లెక్కలు వేసుకున్నా.. అవంతి శ్రీనివాస‌రావు.. గ‌ట్టి పోటీ ఇస్తున్నారు.
గాజువాక‌: కూట‌మికి అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. కానీ, బ‌ల‌మైన నాయ‌కుడు.. మంత్రి అమ‌ర్‌నాథ్ బ‌రిలో ఉండ‌డంతో ఇక్కడ కూడా పోటీ తీవ్రంగానే న‌డుస్తోంది.
ఎస్‌. కోట‌: వైసీపీ బ‌లంగా ఉంది. టీడీపీ నుంచి బ‌రిలో ఉన్న కోళ్ల ల‌లిత కుమారి ఈ ద‌ఫా ప్రచారంలో వెనుక‌బ‌డ్డార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. అంటే.. మొత్తంగా.. విశాఖ పార్ల‌మెంటు ప‌రిధిలో అనుకున్నంతగా టీడీపీ బ‌లంగా పోరాడ‌డం లేద‌ని తెలుస్తోంది. దీనికి తోడు బీసీ మ‌హిళ అనే విష‌యం వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి క‌లిసి వ‌స్తోంది. ఇక‌, మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ వ్యూహాలు క‌లిసి వ‌స్తున్నాయి. ఫ‌లితంగా టీడీపీ అంచ‌నాలు అంత ఈజీకావ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News