BRS : బీఆర్ఎస్ అంచనాలు ఇవేనా..? ఈసారి సిక్సర్ స్టాండ్ దాటి వెళుతుందా?

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. ఫలితాలపై అనేక రకాల అంచనాలు వినిపిస్తున్నాయి

Update: 2024-05-26 06:04 GMT

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి అత్యధిక స్థానాలు వస్తాయన్న విష‍యంలో మాత్రం అనేక రకాలు అంచనాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అత్యధిక స్థానాలను సాధిస్తుందని ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా గతం కంటే ఎక్కువ స్థానాలను సొంతం చేసుకుంటుందని చెబుతున్నారు. కానీ ఈసారి బీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలు వచ్చే అవకాశముందన్న అంచనాలు ఎక్కువగా వినిపిస్తుండటం విశేషం. తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగి ఐదు నెలలు కావస్తుంది. ఆ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఐదునెలలు తిరగక ముందే పుంజుకుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Full Viewపదిహేడింటిలో...
తెలంగాణలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు మూడు, బీజేపీకి నాలుగు స్థానాలు రాగా, ఒకటి ఎంఐఎం దక్కించుకుంది. మిగిలిన తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈసారి కాంగ్రెస్ కు గతం కంటే ఎక్కువగానే సీట్లు దక్కే అవకాశముందని చెబుతున్నారు. అధికారంలో ఉండటంతో పాటు మరో అవకాశం ఇద్దామన్న జనం నాడి కూడా ఆ పార్టీకి అనుకూలించే అంశంగా భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా గతం కంటే తెలంగాణలో బలోపేతమయిందని అంటున్నారు. గతంలో వచ్చిన నాలుగు స్థానాలకు మించి ఈసారి సీట్లు దక్కించుకునే ఛాన్స్ అయితే లేకపోలేదంటున్నారు.
స్థానాలు తగ్గినా...
ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే గతంలో గెలిచిన తొమ్మిది స్థానాలు రాకపోవచ్చు కానీ కనీసం ఆరింటిలో ఆ పార్టీ గెలిచే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఆరు స్థానాలు గెలవడమంటే ఆషామాషీ విషయం కాదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. కేసీఆర్ పై సానుభూతి తో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను సక్రమంగా అమలు చేయకపోవడం, విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు, కరువు, పంటలను కొనుగోలు చేయకపోవడం వంటి కారణాలు బీఆర్ఎస్ కు లాభించే అంశాలుగా చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బస్సు యాత్రతో బయలుదేరిన కేసీఆర్ కు జనం పోటెత్తడాన్ని కూడా ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.
అనేక కారణాలు...
తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు రావడంతో రైతాంగం ఇబ్బందులు పాలయింది. అలాగే అకాల వర్షాలు కూడా అన్నదాతలను నట్టేట ముంచాయి. ధాన్యం కొనుగోలు కూడా సక్రమంగా జరగకపోవడంతో కర్షకులు కారు పార్టీ వైపు చూశారన్న అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ గత పదేళ్ల పాలనపై అసంతృప్తితో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకుంటే ఇప్పుడు అసలుకే మోసం వచ్చిందంటూ రైతాంగం కూడా కొంత గులాబీ పార్టీ వైపు టర్న్ అయినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మహిళలు, రైతులు, యువత కూడా కొంత భాగం కేసీఆర్ పార్టీ వైపు చూడటంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కారు స్పీడ్ మామూలుగా ఉండదన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఆరు కంటే ఎక్కువ స్థానాలు వచ్చినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఏ విషయం తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకూ ఆగాల్సిందే.


Tags:    

Similar News