సచివాలయంలో ఉన్న పరిస్థితిని చూసి అవాక్కయిన చంద్రబాబు
సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు;

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు.
చెత్తగా మారిన ప్రాంతాన్ని చూసి...
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించిందీ లేనిది అడిగారు. సచివాలయంలో అన్ని చోట్లా భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని సూచించారు. అనంతరం మొదటి బ్లాక్‌లోని బ్యాటరీ రూమ్‌ను కూడా సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే రెండవ బ్లాక్‌లో అగ్నిప్రమాదానికి గురైందని సీఎంకు సీఎస్ వివరించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేసిన చంద్రబాబు ఇరవై నాలుగు గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనబడటానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు.