Pawan Kalyan : జమిలి ఎన్నికల నాటికి పవన్ స్కెచ్ మారనుందా? అదే జరిగితే?

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ పూర్తి ఫామ్ లో ఉన్నాడు. సినీరంగంలో లాగా రాజకీయ రంగంలోనూ ఆయన పవర్ స్టార్ అయ్యారు;

Update: 2024-11-29 11:32 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ పూర్తి ఫామ్ లో ఉన్నాడు. సినీరంగంలో వెలిగిపోయినట్లుగా రాజకీయ రంగంలోనూ 2024 ఎన్నికల తర్వాత ఆయన పవర్ స్టార్ అయ్యారు. పవర్ కావాలంటే పవన్ వెంట ఉండాలన్న నినాదాన్ని ఆయన వెంట పెట్టుకుని తిరుగుతున్నారు. ఇది ఆయనకు వెన్నంటి ఉన్న కాపు సామాజికవర్గం కావచ్చు. అభిమానులు కావచ్చు. ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ కావచ్చు. పవన్ కల్యాణ్ పక్కన ఉంటే చాలు గెలుపు తథ్యమన్న భావన రాజకీయపార్టీల్లో నెలకొంది. పవన్ కల్యాణ్ ను వదులుకునేందుకు బహుశ కూటమిలోని ఏ పార్టీ సిద్ధంగా లేదు. పది కాలాల పాటు అధికారంలో ఉండాలంటే పవన్ సహకారం అవసరమన్న నమ్మకంలో నేతలున్నారు.

వదులుకోలేని స్థితిలో టీడీపీ...
అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పవన్ కల్యాణ్ కు అన్ని విధాలుగా గౌరవం ఇస్తున్నారు. గుర్తింపు ఇస్తున్నారు. ఆయన అడిగింది అడిగినట్లు చేస్తున్నారు. తన వారిని కాదనుకుని మరీ పవన్ మాటను తీసిపక్కన పెట్టలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. వంద రోజులు పాలన సమావేశంలోనూ, ఇటీవల జరిగిన ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలోనూ ఇదే కూటమితో వచ్చే ఎన్నికల్లో వెళతామని చంద్రబాబు చెప్పారంటే పవన్ వెంట ఉంటే విజయం తమ వెంటేనన్న ధీమాతో ఉన్నారు. పవన్ కల్యాణ్ కు పెద్దగా పదవీకాంక్ష లేదు. అధికార దాహం కూడా లేదని, అలాగే పాలనలో పెద్దగా జోక్యం చేసుకునే మనస్తత్వం కాదని, తన పని తాను చేసుకుబోయే వ్యక్తి కనుక ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు.
బీజేపీకి వీర భక్తుడు...
ఇక కూటమిలోని మరొక పార్టీ బీజేపీ. బీజేపీ పవన్ కల్యాణ‌్ ను కేవలం ఆంధ్రప్రదేశ్ కు పరిమితం చేసి చూడటం లేదు. దక్షిణాది రాష్ట్రాలకు తమ పార్టీకి ముందు ముందు భవిష్యత్ నేతగా భావిస్తుంది. అందుకే పవన్ కల్యాణ‌్ కు బీజేపీ కేంద్ర నాయకత్వం అంత ప్రయారిటీ ఇస్తుంది. పవన్ తరచూ ఢిల్లీ వెళుతూ యన ప్రాతినిధ్యం వహించే శాఖకు మాత్రం నిధులు దండిగానే మంజూరు చేసుకుంటున్నారు. బీజేపీ అధినాయకత్వం కూడా పవన్ ను మచ్చిక చేసుకుంటుంది. మరో వైపు పవన్ కల్యాణ‌్ కూడా వ్యక్తిగతంగా బీజేపీ కంటే మోదీ, అమిత్ షాలకు వీరభక్తుడిగా నిలిచారు. వారిద్దరినీ అమితంగా ప్రేమించే పవన్ కల్యాణ‌్ వారిని వదులకుని వేరు కుంపటి పెట్టుకునే ప్రయత్నం చేయరన్నది అంతే వాస్తవం.
రానున్న ఎన్నికల్లో ...
అందుకే జమిలి ఎన్నికలు 2027 ఎన్నికల్లో జరుగుతాయిని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే పవన్ కల్యాణ్ పంట పండినట్లే. ఎందుకంటే ముందు వచ్చిన ఎన్నికల్లో పవన్ కల్యాణ‌్ ఈసారి అత్యధిక స్థానాలను కూటమి పార్టీల నుంచి తెచ్చుకునే అవకాశముంది. మొన్నటి ఎన్నికల్లో 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, రెండు పార్లమెంటు స్థానాలకే పరిమితమైన జనసేనాని ఈసారి మాత్రం అంతకు రెట్టింపు స్థానాలను కోరే అవకాశముంది. అందుకే జనసేనలోకి పార్టీ నేతలను చేర్చుకుంటున్నారని అంటున్నారు. టీడీపీ నుంచి కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నారు. కనీసం యాభై స్థానాలకు పైగానే ఈసారి పోటీచేయాలన్న ఉద్దేశ్యంతో ఆయన ఉన్నారని తెలిసింది. తాను కింగ్ మేకర్ గా మారాలన్నది పవన్ కల్యాణ్ వ్యూహంగా కనిపిస్తుంది. అందుకే పవన్ ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. అయితే ఇటీవల శాసనసభలో పదేళ్ల పాటు సీఎంగా చంద్రబాబు ఉండాలని చేసిన కామెంట్స్ కూడా వ్యూహాత్మకమేనని అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు జమిలి ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటాయన్న అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తుంది.


Tags:    

Similar News