ఉత్తర తెలంగాణ, ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అతిభారీ
నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్రమట్టం నుంచి 4.5 కి.మీ నుంచి 7.6 కి.మీ మధ్య ఈ ఆవర్తనం కొనసాగుతోంది. దానికి సమాంతరంగా పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో రానున్న రెండురోజుల్లో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. బుధవారం అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా గార్లలో 7.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. మరోవైపు ఏపీలోని వైజాగ్, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో రానున్న రెండు గంటల్లో మోస్తరు వర్షం కురవచ్చని తెలిపింది. కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షం కురిసే సమయంలో ప్రజలెవరూ చెట్ల కింద, పొలాల్లో ఉండొద్దని హెచ్చరించింది.