Exise Policy In Andhra Pradesh : మద్యం పాలసీ తెచ్చిన కొత్త తంటా.. తిరగబడుతున్న జనం

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఎక్సైజ్ పాలసీ మద్యం దుకాణదారులకు లాభాలను తెచ్చిపెడుతుంది. అదే సమయలో ప్రజల ఆరోగ్యాలను చెడగొడుతుంది

Update: 2024-10-21 06:07 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఎక్సైజ్ పాలసీ మద్యం దుకాణదారులకు లాభాల పంట తెచ్చిపెడుతుంది. అదే సమయలో ప్రజల ఆరోగ్యాలను చెడగొడుతుంది. వైన్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. చూసీ చూడనట్లు కొందరు వదలిస్తున్నారు. మరికొందరు ఎక్సైజ్ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వైన్ షాపుల్లోనే బహిరంగంగా మద్యాన్ని సేవిస్తుండటం, అనుమతి లేకుండా పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేసుకోవడం, అక్కడే బార్ తరహా వాతావరణం నెలకొల్పడంతో తాగుబోతులను ఆకట్టుకునేందుకు ఎక్కువగా మద్యం దుకాణాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల ప్రజలు తిరగబడుతున్నారు.

అక్కడే ఫుడ్ స్టాల్స్...
మద్యం దుకాణాల వద్దనే మంచింగ్ కోసం ఫుడ్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేసుకుని బహిరంగంగా మద్యాన్ని సేవిస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. మద్యం దుకాణల్లోనే వాటర్ బాటిల్స్ తో పాటు సోడాలు కూడా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం వైన్ షాపుల వద్ద మద్యాన్ని సేవించకూడదు. పర్మిట్ రూంలకు ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన తర్వాతనే వాటిని నడుపుకోవాల్సి ఉంది. అయితే కొత్తగా ప్రారంభించిన మద్యం దుకాణాల్లో ఎక్కువ శాతం అంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో మాత్రమే కాకుండా రూరల్ ఏరియాల్లోనూ పర్మిట్ రూంలను ఏర్పాటు చేసుకున్నారు.
వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు..
మద్యం అక్కడే సేవిస్తూ అక్కడే కొందరు ఉంటున్నారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల ఘర్షణలు కూడా తలెత్తుతున్నాయి. సొంత వాహనాలను తీసుకు వచ్చి అక్కడే గంటల పాటు కూర్చుని మద్యం తాగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. సిట్టింగ్ ల కోసం ప్రత్యేకంగా వైన్ షాపుల పక్కనే షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. అయినా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం ప్రవేశపెట్టిన కొత్త పాలసీతో సర్కార్ కు ఏమో కాని వైన్ షాపుల యజమానులకు మాత్రం కాసుల పంట పండుతోంది. లక్షలు వెచ్చించి షాపులు దక్కించుకున్న వారు వెంటనే దానిని తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


Tags:    

Similar News