Tiruamala : వెయిటింగ్ ఎంత సేపు అంటే .. నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.;

Update: 2024-11-24 03:25 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. కార్తీక మాసం కావడంతో తిరుమలను దర్శించే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఒకింత రద్దీ తగ్గుతుందని టీటీడీ అధికారులు అంచనా వేసినప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధానంగా కంపార్ట్ మెంట్లలో భక్తులకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చుతున్నారు. అన్నదాన సత్రం వద్ద కూడా రద్దీ ఎక్కువగా ఉంది. ఇక లడ్డూల కౌంటర్ వద్ద కూడా రద్దీ మరింత ఎక్కువ కావడంతో ఎక్కువ కౌంటర్ల ద్వారా లడ్డూలను విక్రయిస్తున్నారు. అయితే రేపు కార్తీక సోమవారం కావడం, చివరి సోమవారం కావడంతో తిరుమలకు ఒకింత భక్తుల తాకిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. సోమవారం నుంచి గురువారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ అంతగా ఉండదు. అయితే రేపు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం మాత్రం లేకపోలేదు.

పదిహేను కంపార్ట్ మెంట్లలో...
మరోవైపు త్వరలో తుపాను ఉందన్న హెచ్చరికలు ఉండటంతో రైళ్లు, బస్సులు రద్దవుతాయేమోనని భావించి ముందుగా బుక్ చేసుకున్న వారు తిరుమలకు చేరుకుంటున్నారని అధికారులు తెలిపారు. వసతి గృహాల వద్ద కూడా వెయిటింగ్ ఎక్కువ సేపు ఉండాల్సి వస్తుంది. అలాగే తిరుమలలో వీధులన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేను కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటలు శ్రీవారి దర్శన సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,147 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,096 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.16 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News