Andhra Pradesh : సోషల్ మీడియా వార్ మరింత ముదురుతుందా? ఆపేదెవరు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రానున్న కాలంలో మరింత వేడెక్కనున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు
నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టివస్తుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా యుగం ప్రారంభమయింది. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రానున్న కాలంలో మరింత వేడెక్కనున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఎవరూ ఎవరికీ తగ్గని పరిస్థితుల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా ద్వారా రాజకీయ పార్టీలు తమ ప్రయత్నాలను ఇప్పటికే ఏపీలో ప్రారంభించాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ ఏ అంశం పై సోషల్ మీడియాలో పోస్టు చేస్తారో? ఎవరిని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడతారన్నది రాజకీయ నేతలకు టెన్షన్ పట్టుకుంది. ఒకరకంగా ఏపీలో సోషల్ మీడియా వార్ నడుస్తుందని చెప్పాలి.
రెండు పక్షాలు...
అధికార టీడీపీ కూటమితో పాటు విపక్ష వైసీపీ కూటములు ఎవరికి వారు ప్రత్యేకంగా తమకంటూ సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకుని అవతలివారిని ఇబ్బంది పెట్టే విధంగా పోస్టులు పెట్టడం గత కొద్ది రోజుల నుంచి ప్రారంభమయింది. ఎన్నికలు ఇప్పుడే లేకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా అధికార, విపక్షాల మధ్య వార్ మొదలయిందనే చెప్పాలి. ఫేక్ న్యూస్ ను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తూ ప్రజలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో రాజకీయ పార్టీలున్నాయి. అయితే ఇందులో కొందరు శృతి మించి పోతున్నారు. వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తూ వావీ వరస లేకుండా పోస్టులు పెట్టడం కూడా కనిపిస్తుంది. దీంతో ఇటీవల కాలంలో అధికార పార్టీ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలను ప్రారంభించింది.
అనేక కేసులు...
విపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలపై ఇప్పటికే అనేక మందిపై కేసులు నమోదయ్యాయి. అలాగే అనేక మంది అరెస్ట్ కాగా, చాలా మందికి నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో వైసీపీ కూడా తమ అధినేత జగన్ పైనా, పార్టీ నేతలపైన టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వచ్చే పోస్టులపై పోలీసులకు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. అయితే ఒకరినొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటున్నప్పటికీ పోస్టులు మాత్రం ఆగడం లేదు. వైసీపీ అధినేత జగన్ కూడా తనను ముందుగా అరెస్టు చేయాలని, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పార్ట అండగా ఉంటుందని, అవసరమైన న్యాయసాయం అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించి మరింత రెచ్చిపోయేలా చేశారు.
పోటాపోటీగా...
ఇచ్చిన హామీలు అధికార పార్టీ అమలు చేయడం లేదంటూ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పోస్టు పెడుతున్నారు. అదే సమయంలో జగన్, అదానీ సంబంధాలు, అవినీతి కార్యక్రమాలంటూ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. అయితే రెండు పార్టీలదీ ఒకటే ధ్యేయం. తప్పుడు ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లడం అవతలవారిని డ్యామేజీ చేయడం ముఖ్యంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందడానికి ఇప్పటి నుంచే సోషల్ మీడియావార్ ఏపీలో ప్రారంభమయిందని చెప్పాలి. కూటమి లోని పవన్ కల్యాణ్ ను కూడా కొందరు టార్గెట్ చేసుకుంటున్నారు. ఇలా మొత్తం మీద ఏపీలో సోషల్ మీడియా వార్ ముదిరి ఏ దారికి తీస్తుందోనన్న ఆందోళన ఇరుపార్టీల నతేల్లో నెలకొంది. కానీ రాజకీయ పార్టీల అధినేతలు ఆదేశిస్తేనే ఈ సోషల్ మీడియా వార్ కు తెరపడుతుందని చెప్పవచ్చు.