ఏపీ ఆర్టీసీకి షాక్ ఇచ్చిన చమురు కంపెనీలు
ఆర్టీసీకి చమురు కంపెనీలు.. బయటి మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే డీజిల్ ను సరఫరా చేస్తుంటాయి. కానీ.. గడిచిన 10 రోజులుగా..
ఏపీ ఆర్టీసీకి చమురు కంపెనీలు ఊహించని షాక్ ఇచ్చాయి. నిత్యం లక్షల లీటర్ల డీజిల్ ను వినియోగించే ఆర్టీసీకి చమురు కంపెనీలు.. బయటి మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే డీజిల్ ను సరఫరా చేస్తుంటాయి. కానీ.. గడిచిన 10 రోజులుగా ఈ ధరల్లో తేడా వచ్చింది. సామాన్య పౌరులకు విక్రయించే డీజిల్ ధర కంటే.. ఆర్టీసీకి ఇచ్చి డీజిల్ ధర రూ.4.30 అదనంగా వసూలు చేస్తున్నాయి చమురు కంపెనీలు. ఆర్టీసీకి భారీగా డీజిల్ ధరలను వడ్డించడంతో.. సంస్థపై అదనంగా రూ.10 కోట్లు భారం పడినట్లు సమాచారం. దాంతో ఆర్టీసీ ఎండీ తిరుమలరావు.. ఇకపై ఆర్టీసీ బస్సులకు బయటి పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొట్టించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read : భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్.. ఎప్పుడంటే..?
బయటి వారికి విక్రయించే ధర కంటే.. ఆర్టీసీకి అధిక ధరకు డీజిల్ ఎందుకు విక్రయిస్తున్నారో ఇంతవరకూ చెప్పలేదు చమురు కంపెనీలు. ఇలాగైతే ఆర్టీసీ దివాళా తీస్తుందని.. తిరుమల రావు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ వ్యాప్తంగా నిత్యం 10వేల బస్సులకు సుమారు 7.3 లక్షల లీటర్ల డీజిల్‌ను అధికారులు వాడుతుంటారు. అందుకే ఆర్టీసీకి డీజిల్ ధరపై రాయితీని ఇస్తుంటాయి. బయటి మార్కెట్ ధరతో పోలిస్తే.. ఆర్టీసీకి ఇచ్చే డీజిల్ ధర రూ.2 తక్కువగా ఉంటుంది. కానీ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ ధరను చమురు కంపెనీలు భారీగా పెంచేశాయి.