Weather Report : ఏందిరా బాబూ ఈ వర్షాలు.. మళ్లీ కుండపోత తప్పదా?
ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వీడటం లేదు. మరో అల్పపీడనం ఏపీకి పొంచి ఉంది
ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వీడటం లేదు. వరసగా అల్పపీడనాలు బంగాళాఖాతంలో ఏర్పడుతుండటంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు కూడా గత కొద్ది రోజులుగా తడిసి ముద్దవుతున్నాయి. సాధారణ జనజీవనం స్థంభించిపోతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకూ చినుకు పడితే చిరాకు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు ఎదురు అవుతుండటంతో వదలకుండా పడుతున్న వర్షాలతో అన్ని రకాలుగా నష్టపోతున్నారు. పేద, మధ్యతరగతి వర్గాల నుంచి ప్రజలందరూ వరసగా కురుస్తున్న వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నారు.
వరస గా కురుస్తూ...
మొన్న ఫెంగల్ తుపాను కారణంగా ఏపీ, తమిళనాడు,పుదుచ్చేరిలో కుండ పోత వర్షం పడింది. తర్వాత మళ్లీ బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో మూడు రోజుల పాటు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలతో పాటు తమిళనాడు అంతటా వర్షం కురిసింది. అయితే వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింద.ి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఈరోజుఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశంఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారి మరో రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
సోమవారం నుంచి...
ఈ ప్రభావంతో సోమవారం నుంచి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా ప్రాంతంలోనూ ఒక మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తీర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. రైతులు కూడా తమ పంట ఉత్పత్తులను కాపాడుకోవాలని చెబుతున్నారు.