Ys Jagan : సొంత ఇలాకాలోనే ఇలాగయితే ఎలా జగనూ.. కుప్పం తరహా వ్యూహమేనా?

వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది

Update: 2024-12-15 07:21 GMT

వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు టీడీపీ నేతలు కడపలో అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం జగన్ సొంత జిల్లా కడపలో ఫ్యాన్ పార్టీ కష్టాల్లో పడిందనే చెప్పాలి. ఎలాగయితే తమను ఇబ్బంది పెట్టారో.. అదే రీతిలో తాము వ్యవహరించాలని తెలుగు తమ్ముళ్లు నిర్ణయించుకున్నట్లుంది. అందుకే కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ఆనవాళ్లు కనిపించడకుండా జిల్లాలో చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా కొంత వరకూ విజయవంతం అయ్యారనే చెప్పాలి.

కుప్పంలోనూ అంతే...
వైసీపీ అధికారంలో ఉండగా 2019 నుంచి 2024 వరకూ వైసీపీ కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటినీ గెలుచుకుని చంద్రబాబు పని అయిపోయిందని బయటకు సంకేతాలను పంపారు. కుప్పం మున్సిపాలిటీ దగ్గర నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను వైసీపీ గెలుచుకుని ఇక తమకు తిరుగులేదని భావించింది. కానీ సాధారణ ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం రిజల్ట్ రివర్స్ అయింది. చంద్రబాబు అత్యధిక మెజారిటీతో మరోసారి విజయం సాధించారు. కుప్పంలో వైసీపీ అనుసరించిన వ్యూహాలు సాధారణ ఎన్నికల్లో మాత్రం పనిచేయలేదని దీనిని బట్టి అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు జగన్ సొంత జిల్లా కడపలోనూ టీడీపీ అదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తుంది.
కడప కార్పొరేషన్ ను కూడా...
కడప కార్పొరేషన్ ను కైవసం చేసుకునేందుకు సిద్ధమయింది. ఏడుగురు కార్పొరేటర్లు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి ఈ ఏడుగురు కార్పొరేటర్లు గైర్హాజరు కావడంతో వారి చేరిక అనివార్యమయింది. మొన్నటి సాధారణ ఎన్నికల్లోనే జగన్ కు కడప జనం ఝలక్ ఇచ్చారు. కడప జిల్లాలో ఉన్న పది శాసనసభ నియోజకవర్గాల్లో వైసీపీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలిచింది. పులివెందుల, బద్వేలు, రాజంపేట నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో సాధారణ ఎన్నికల సమయంలోనే జగన్ కు షాక్ తగిలింది.
పులివెందులలోనూ...
దీంతో పాటు ఇటీవల జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ అన్నీ ఏకగ్రీవం చేసుకుంది. నామినేషన్లు వేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. అయితే తమవారిని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నప్పటికీ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో మాత్రం సైకిల్ సవారీ సవాలు విసిరింది. దీంతో కడప జిల్లా చేజారి పోయే అవకాశముందన్న ఆందోళన ఫ్యాన్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. రానున్న కాలంలో మరింత మంది వైసీపీ నేతలు టీడీపీ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద నాడు వైసీపీ అనుసరించిన కుప్పం తరహా వ్యూహాన్నే కడప జిల్లాలో టీడీపీ నేడు అమలు పరుస్తుందని చెప్పాలి.



Tags:    

Similar News