Weather Report : ఈరోజు అల్పపీడనం.. మళ్లీ వర్షాలేనట

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వర్షాలు మొదలు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీవర్షాలు కురుస్తున్నాయి

Update: 2024-12-15 04:45 GMT

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వర్షాలు మొదలు కానున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరంవైపు కదిలే అవకాశముందని కూడా అంచనా వేస్తున్నారు. దీంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో భారీ వర్షాలు నమోదవుతాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, రెండు మూడురోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి.

వరస వర్షాలతో...
ఆ మధ్య వచ్చిన ఫెంగల్ తుపాను కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తీవ్ర స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, రాయలసీమలో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో రైతులు తమ పంట నష్టపోయారు. వరి ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో కొనేవారు లేక ఇబ్బందులు పడ్డారు. అలాగే కోతకు వచ్చిన పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వర్షాలు రైతాంగాన్ని తీవ్రంగానే భయపడుతున్నారు. తమిళనాడు బాగా నష్ట పోయింది. పుదుచ్చేరిలో కూడా అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా తీవ్రంగా జరిగింది. దీతో చినుకుపడితే చాలు ఈ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు.
మూడు రోజుల పాటు...
ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణకోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో రైతులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు నీటితో నిండిపోవడంతో మరింతగా నదులు, వాగులు ఉప్పొంగే అవకాశముందని చెప్పారు. వాగులు, వంకలు దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. మరోవైపు తీర ప్రాంత ప్రజలను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశముంది.


Tags:    

Similar News