Tirumala Laddu : తిరుమల లడ్డూ కల్తీపై విచారణ వేగవంతం
తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ జరిగిన అంశంపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ విచారణను వేగవంతం చేసింది
తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ జరిగిన అంశంపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ విచారణను వేగవంతం చేసింది. గత రెండు రోజుల నుంచి విచారణ ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుమలకు చేరుకుని విచారణ ప్రారంభించింది. తిరుపతిలో ప్రత్యేకంగా వీరి కోసం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు బృందాలుగా విడిపోయి తిరుమల లడ్డూ తయారీలో కల్తీ పై వీరు విచారణ జరుపుతున్నారు. ఎప్పుడో విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, తుపాన్లు, బ్రహ్మోత్సవాలు ఉండటంతో ఆలస్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ప్రారంభించిన నేపథ్యంలో ఎలాంటి నిజాలు బయటపడతాయోనన్న ఆసక్తి నెలకొంది.
ప్రత్యేక దర్యాప్తు బృందం...
గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని, నాసిరకం నెయ్యిని వాడారంలూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించిన నేపథ్యంలో వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను కాదని సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. అయితే రెండు రోజుల నుంచి ఈ బృందం తిరుమల, తిరుపతితో పాటు చెన్నైలో కూడా పర్యటించి దర్యాప్తు చేపట్టింది. గతంలో సిట్ విచారణ చేసిన అంశాలను కూడా ఈ దర్యాప్తు సంస్థ అధికారులు పరిగణనలోకి తీసుకుని ఆ దిశగా విచారణ చేస్తున్నారు.
డెయిరీలలో విచారణ...
ప్రధానంగా తమిళనాడులో ఉన్న ఏఆర్ డెయిరీలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ సభ్యులు తనిఖీలు చేశారు. అలాగే వైష్ణవి డెయిరీలో కూడా సోదాలు నిర్వహించారు. డెయిరీల సామర్థ్యం ఎంత? చిల్లింగ్ సెంటర్లతో పాటు నెయ్యి ఉత్పత్తిపై దర్యాప్తు సంస్థ అధికారులు వివరాలను సేకరించారు. అలాగే దిండిగల్ లోనే పదకొండు మంది సిట్ సభ్యులుండి విచారణ చేస్తున్నారు. నాయుడుపేటలో ఉన్న వైష్ణవి డెయిరీని కూడా పరిశీలించారు. మరొక బృందం వివిధ కంపెనీలతో నాటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కుదుర్చుకున్న ఒప్పంద వివరాలను కూడా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. తక్కువధరకు నెయ్యి సరఫరా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టింది. పోటులో ఉన్న శ్రీవైష్ణవులను కూడా తిరుమల లడ్డూ కల్తీపై ప్రశ్నించే అవకాశాలున్నాయి.