బెంగళూరులో దారుణం..రాత్రంతా కారులో తిప్పుతూ యువతిపై సామూహిక అత్యాచారం

కోపంగా వెళ్లిపోయిన యువకుడు కాసేపటికి ముగ్గురు స్నేహితులతో వచ్చి యువతి స్నేహితుడిని బెదిరించి ఆమెను బలవంతంగా కారులోకి..;

Update: 2023-04-01 08:40 GMT
gang rape in moving car, bengaluru crime news

gang rape in moving car

  • whatsapp icon

బెంగళూరు నగరంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పార్కులో స్నేహితుడితో కూర్చొన్న 19 ఏళ్ల యువతిని నలుగురు యువకులు బలవంతంగా కారులో ఎక్కించుకుని సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. మార్చి 25న జరిగిన ఈ ఘటన వారంరోజులు ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని కోరమంగళ నేషనల్ గేమ్స్ పార్క్ వద్ద బాధిత యువతి తన స్నేహితుడితో కలిసి కూర్చుంది.

అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఇంత రాత్రి పూట ఇక్కడేం చేస్తున్నారంటూ వాదనకు వచ్చాడు. ఆ విషయం నీకెందుకని, నీ పని నువ్వు చూసుకోవాలని యువతి, ఆమె స్నేహితుడు హెచ్చరించారు. కోపంగా వెళ్లిపోయిన యువకుడు కాసేపటికి ముగ్గురు స్నేహితులతో వచ్చి యువతి స్నేహితుడిని బెదిరించి ఆమెను బలవంతంగా కారులోకి ఈడ్చుకెళ్లారు. రాత్రంతా ఆమెను కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో యువతిని ఆమె ఇంటి సమీపంలో వదిలి పరారయ్యారు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
కొద్దిరోజులకు యువతి ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా.. ఆమె ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. అనంతరం కోరమంగళ పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన సతీశ్, విజయ్, శ్రీధర్, కిరణ్‌లను అరెస్ట్ చేశారు. వారి వయసు 22 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకడు యువతికి స్నేహితుడేనని.. ఆ నలుగురూ ఒకేప్రాంతానికి చెందినవారని పేర్కొన్నారు.




Tags:    

Similar News