Chithoor : దొంగలు దొరికారు.. అందుకే వచ్చారట
చిత్తూరు ఆపరేషన్ పూర్తయింది. దొంగలు పోలీసులకు దొరికపోయారు.;

చిత్తూరు ఆపరేషన్ పూర్తయింది. దొంగలు పోలీసులకు దొరికపోయారు. చిత్తూరులోని గాంధీ రోడ్డులో ఒక వ్యాపారి ఇంట్లో దోపిడీకి పాల్పడటానికి ప్రయత్నించిన దొంగలు గాలిలోకి కాల్పులు జరిపారు. దొంగలు అందరూ అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం పది మంది దొంగలు ఒక ఇంటిని చుట్టుముట్టి దోపిడీకి ప్రయత్నించారు. లక్ష్మీ సినిమా హాల సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. యజమాని వెంటనే అరవడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమైపోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఆక్టోపస్ దళాలు చేరుకుని భవనంలో ఉన్న వారిని బయటకు రావాలని కోరారు.
గాలిలోకి కాల్పులు...
అయితే వారు గాలిలోకి కాల్పులు జరపడంతో యజమాని చంద్రశేఖర్ కు గాయాలయ్యాయి. ఆయనను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అంందిస్తున్నారు. దొంగల ముఠా ఈరోజు ఉదయం నుంచి బీభత్సం సృష్టించడంతో పోలీసులు పెద్దయెత్తున బలగాలు మొహరించి భవనంలోపలకి అడుగు పెట్టగలిగారు. అయితే వారు తమపై కాల్పులు జరపకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆపరేషన్ ను చాలా జాగ్రత్తగా నిర్వహించారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా, కాల్పుల్లో ఎవరూ గాయపడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుని పోలీసులు పక్కా ఆపరేషన్ ను నిర్వహించారు. చిత్తూరు ఎస్పీ అక్కడే ఉండి ఆపరేషన్ ను పర్యవేక్షించారు.
అందుకే వచ్చారట...
ఈ ముఠా కర్నూలు జల్లా నంద్యాల నుంచి కొందరు, అనంతపురం జిల్లా నుంచి కొందరు వచ్చినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. ఇంటి యజమాని చంద్రశేఖర్ ఇంట్లో డబ్బు ఉందని భావించి వాటిని దోచుకోవడానికి పక్కా ప్లాన్ తో వచ్చారని పోలీసులు ప్రాధమికంగా అభిప్రాయపడుతున్నారు. ఒక ఫర్నీచర్ షాపులో పనిచేసే వ్యక్తి ఇచ్చిన సమాచారంతోనే దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారన్నది పోలీసుల అనుమానం. దొంగలందరినీ అదుపులోకి తీసుకోవడంతో వారిని మరికొద్దిసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. అదే సమయంలో వారిని విచారించేందుకు కూడా కొంత సమయం తీసుకుని తర్వాత న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు.