చిత్తూరు లో యువతి అనుమానాస్పద మృతి.. మతాంతర వివాహమే కారణమా?
చిత్తూరులో జరిగిన దారుణం కలకలం రేపింది. పెళ్లయిన యువతి అనుమానాస్పదంగా మరణించడంతో దానిని పరువు హత్యగా అనుమానిస్తున్నారు;

చిత్తూరులో జరిగిన దారుణం కలకలం రేపింది. పెళ్లయిన యువతి అనుమానాస్పదంగా మరణించడంతో దానిని పరువు హత్యగా అనుమానిస్తున్నారు. మతాంతర వివాహం చేసుకున్న ఒక యువతి పుట్టింటికి వచ్చి శవమై తేలడంతో ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరులోని బాలాజీనగర్ లో నివాసముంటన్న షౌకత్ ఆలి, ముంతాజ్ ల కుమార్తె యాస్మిన్ భాను ఎంబీఏ చదువుతూ ప్రేమలో పడింది. పూతలపట్టు మండలానికి చెందిన సాయితేజ్ తో ప్రేమలో పడింది. అయితే యాస్మిన్ భానుకు పెద్దలు పెళ్లి కు8దరిచ్చారు. వీరిద్దరి ప్రేమను తెలుసుకున్న యాస్మిన్ తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి అంగీకరించలేదు.
పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా...
అంగీకరించకపోగా తాము వేరే పెళ్లి చేస్తామని చెప్పడంతో యాస్మిన్, సాయితేజ్ లు ఈ ఏడాది ఫిబ్రవరిలో నెల్లూరుకు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇరు కుటుంబాలను పిలిచిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరూ మేజర్లు కావడంతో పెళ్లికి అంగీకరించాలని తెలిపారు. అందుకు ఓకే అని చెప్పిన షౌకత్ ఆలీ కుటుంబం తిరిగి చిత్తూరుకు వచ్చారు. అయితే తమ కుమార్తె మతాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన షౌకత్ ఆలి కుటుంబ సభ్యులు తమ కుమార్తె యాస్మిన్ ను ఇంటికి తీసుకు వచ్చేందుకు పథకం రచించారు. ఫోన్ లో మాట్లాడుతూ తమకు పెళ్లి ఇష్టమేనని నమ్మకంగా ఉన్నారు.
తండ్రికి అనారోగ్యం అని చెప్పి...
కానీ తండ్రి షౌకత్ ఆలీకి అనారోగ్యంగా ఉందని చెప్పడంతో హుటాహుటిన సాయితేజ్ తన భార్య చిత్తూరును తీసుకు వచ్చి గాంధీ విగ్రహం వద్ద ఆమె సోదరుడి కారులో ఎక్కించి పుట్టింటికి పంపాడు. అయతే సాయంత్రానికి యాస్మిన్ మరణించినట్లు వార్త రావడంతో సాయితేజ్ హతాశుడయ్యాడు. ఏదో జరిగిందనిఅనుమానం వచ్చి నేరుగా వారి ఇంటికి వెళ్లగా మార్చురీలో యాస్మిన్ మృతదేహం ఉందని చెప్పారు. తండ్రి దూషించడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని నమ్మకలికే ప్రయత్నం చేశారు. అయితే సాయితేజ్ మాత్రం తన భార్య యాస్మిన్ పరువు హత్యకు గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఉరి వేసుకున్న ఆనవాళ్లు లేకపోవడంతో పోలీసులు కూడా దీనినపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.