ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. అక్కడ రీల్స్ చేయడమే కారణం
ఓ వ్యక్తి, అతడి భార్య, మూడేళ్ల కొడుకు
ప్రజలు షార్ట్ వీడియోస్ కు ఎంతగా అలవాటు పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీల్స్, షార్ట్స్ అంటూ తెగ సమయాన్ని వెచ్చించేస్తూ ఉన్నారు. అయితే ఈ రీల్స్ చేసే అలవాటు కూడా చాలా మందిలో పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రమాదకరమైన ప్రాంతాలు అని తెలిసినా కూడా అక్కడా రీల్స్ చేసేస్తూ ఉన్నారు. ఎంతో మంది అలా రీల్స్ పిచ్చిలో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం నాడు ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబంలోని ముగ్గురు రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు.
పట్టాలపై వీడియో రికార్డింగ్ చేస్తుండగా ప్యాసింజర్ రైలు ఢీకొని ఓ వ్యక్తి, అతడి భార్య, మూడేళ్ల కొడుకు మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు మహ్మద్ అహ్మద్ (26), అతని భార్య నజ్నీన్ (24), వారి మూడేళ్ల కుమారుడు అబ్దుల్లా ప్రాణాలు కోల్పోయారు. సీతాపూర్ జిల్లాలోని షేక్ తోలా, లాహర్‌పూర్ నివాసితులు. ఖేరీ టౌన్ కొత్వాలి ఇన్‌చార్జి అజీత్ కుమార్ మాట్లాడుతూ.. అహ్మద్ కుటుంబం రైలు పట్టాలపై రీల్స్ ను రికార్డ్ చేస్తుండగా రైలు వారిని ఢీకొట్టిందన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.