యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది.. బీజేపీ, భజరంగ్ దళ్ ఆందోళన
ఆగస్టు 23న అంకిత నిద్రిస్తున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి, అక్కడి నుంచి పరారయ్యాడు.
తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ప్రేమోన్మాది నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలో జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షారూక్ హుస్సేన్ (19) అనే యువకుడు అంకిత (19) అనే యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. అంకిత తనకు ఇష్టం లేదని చెప్పడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. తన ప్రేమను నిరాకరించడంతో.. హుస్సేన్ ఉన్మాదిగా మారాడు.
ఆగస్టు 23న అంకిత నిద్రిస్తున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి, అక్కడి నుంచి పరారయ్యాడు. అరుపులు కేకలు విన్న కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు మంటలు ఆర్పగా.. అప్పటికే 90 శాతం శరీరం కాలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు షారూఖ్ తో పాటు అతనికి పెట్రోల్ అందించిన చోటుఖాన్ అనే మరో యువకుడిని అరెస్ట్ చేసి, ఇద్దరిపై హత్యకేసు నమోదు చేశారు.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన మరణ వాంగ్మూలంలో .. షారూక్ తనకు ఫోన్ చేసి ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడని పేర్కొంది. మంగళవారం ఉదయం నిద్రిస్తున్న తనకు కాలుతున్న వాసన వస్తుండడంతో మెలకువ వచ్చి చూసే సరికి షారూక్ పారిపోతూ కనిపించాడని, తాను తేరుకునేలోపే మంటలు అంటుకున్నాయని తెలిపింది. వెంటనే తన తండ్రి గదిలోకి పరిగెత్తానని, వారు మంటలు ఆర్పి తనను ఆసుపత్రికి తరలించాలని పేర్కొంది. కాగా.. అంకిత హత్య రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. నిరసనలు, ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తమవ్వడంతో దుమ్కాలో 144 సెక్షన్ అమలు చేశారు.