దృశ్యం స్ఫూర్తితో.. రెండున్నరేళ్ల కొడుకుని చంపి..హైడ్రామా

వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్ కు చెందిన నయన మాండవి అనే మహిళ సూరత్ లోని దిండోలి ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికురాలిగా..

Update: 2023-07-03 04:04 GMT

అక్రమ సంబంధాలు చంపడం లేదా చావడానికి దారితీస్తున్నాయి అనేందుకు ప్రతిరోజూ ఏదొక సంఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా.. ప్రేమికుడితో వెళ్లిపోవాలనుకున్న ఓ వివాహిత.. తన రెండున్నరేళ్ల కొడుకు అడ్డుతొలగించుకోవాలనుకుంది. కొడుకుని చంపిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని, సాక్ష్యాలను మాయం చేయడం ఎలా? అని తెలుసుకునేందుకు దృశ్యం సినిమా చూసింది. ఆ సినిమా స్ఫూర్తితో పక్కా ప్లాన్ తో కొడుకుని చంపేసి.. ఏమీ తెలియనట్టుగా తన కొడుకు కనిపించడం లేదంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దృశ్యం సినిమా తనకే తెలుసు అనుకుంటే ఎలా? పోలీసులకు కూడా స్టోరీ తెలుసు కదా. తమ స్టైల్లో మహిళను విచారించడంతో తానే చంపినట్లు నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటన ఝార్ఖండ్ లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్ కు చెందిన నయన మాండవి అనే మహిళ సూరత్ లోని దిండోలి ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోంది. భర్త చనిపోయాడు. ఆమెకు వీర్ మాండవి అనే రెండున్నరేళ్ల కొడుకు ఉన్నాడు. ఝార్ఖండ్ లో ఉన్న సమయంలో నయనకు మరో వ్యక్తితో అక్రమసంబంధం ఉంది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు అతను అంగీకరించాడు కానీ.. కొడుకుని కూడా తీసుకువస్తే పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో.. పిల్లాడిని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే వీర్ ను హత్య చేసి.. మరుగుదొడ్డి నిర్మాణం కోసం తీసిన గుంతలో పడేసి పూడ్చిపెట్టింది. రెండురోజుల తర్వాత కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
స్థానిక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు బాలుడు తల్లిపనిచేసే ప్రాంతం నుంచి బయటకు వెళ్లలేదని గుర్తించారు. డాగ్ స్క్వాడ్ తో వెతికించినా ఫలితం లేదు. ఇక నయన మాండవిని పోలీసులు విచారించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చింది. తొలుత ఆమె ప్రేమికుడే కిడ్నాప్ చేసి ఉంటాడని చెప్పింది. అతని మొబైల్ నంబర్ ను ట్రేస్ చేయగా.. బాలుడు కనిపించకుండా పోయినపుడు అతను సూరత్ పరిసరాల్లోనే లేడని తేలింది. అతను కూడా తానెప్పుడూ సూరత్ కు రాలేదని చెప్పడంతో.. నయనపై పోలీసుల అనుమానం మరింత బలపడింది. తమదైన శైలిలో ప్రశ్నించగా.. నేరాన్ని అంగీకరించిన నయన.. మృతదేహాన్ని తొలుత నీళ్లబావిలో పడేశానని, ఆ తర్వాత గొయ్యి తీసి పూడ్చానని చెప్పింది. ఆ ఆనవాళ్లలేమీ లేకపోవడంతో.. గట్టిగా విచారించగా.. అసలు విషయం చెప్పింది. మరుగుదొడ్డికోసం తీసిన గుంతను తవ్వి చూడగా బాలుడి మృతదేహం కనిపించింది. నయన మాండవిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపారు.










Tags:    

Similar News