Fire Accident : ఒక్కసారిగా మంటలు.. ఆరుగురు కార్మికుల మృతి
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవదహనమయ్యారు.
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. మహారాష్ట్రలోని హ్యాండ్ గ్లవ్స్ పరిశ్రమలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో అనేక మంది గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీసినా కొందరు అందులో చిక్కుకున్నారు.
నిద్రిస్తుండగా...
ఛత్రపతి శంభాజీ నగర్‌లో అర్థరాత్రి ఈ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది దాదాపు ఆరు గంటల పాటు ప్రయత్నించారు. చివరకు మంటలను అదుపులోకి తేగలిగారు. పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు అగ్ని మాపక సిబ్బంది అనేక ప్రయత్నాలు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీ లో ఇరవై ఐదు మంది కార్మికులున్నారని అక్కడి వారు చెబుతున్నారు. వారంతా నిద్రమత్తులో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
మంటలు వ్యాపించడంతో...
నైట్‌షిఫ్ట్‌లో ఉన్న ఉద్యోగులు కొంత విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో మంటల ధాటికి కొందరు కార్మికులు నిద్ర లేచి బయటకు పరుగులు తీశారు. అయితే కొందరు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. మంటలు పెద్దయెత్తున వ్యాపించడంతో బయటకు రాలేక మాడి మసై పోయారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.