హైదరాబాద్ మైనర్ గ్యాంగ్ రేప్: అమ్మో నిందితులకు ఎన్ని తెలివితేటలో..!
పోలీసులకు చిక్కకూడదన్న భావనతో తామంతా గోవాకు వెళుతున్నామని చెప్పి, తమ సెల్ ఫోన్లను మాత్రం గోవాకు పంపి..
ఆమ్నేషియా పబ్ సమీపంలో బాలికను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలన్న విషయంపై ముందే పక్కా ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. బాలికను ఇన్నోవా కారులో ఎక్కించుకుని దాదాపుగా 2 గంటల పాటు ఆమెపై కారులోనే గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డ నిందితులు ఆ తర్వాత బాలికను పబ్ వద్దే దింపేసి వెళ్లినట్లు పోలీసులు తేల్చారు. గ్యాంగ్ రేప్‌పై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న నిందితులు పోలీసులకు చిక్కకూడదన్న భావనతో తామంతా గోవాకు వెళుతున్నామని చెప్పి, తమ సెల్ ఫోన్లను మాత్రం గోవాకు పంపి.. వాళ్లు కర్ణాటకకు పరారయ్యారు. ఇక హైదరాబాద్ నుంచి వెళ్లిపోయే సమయంలో ఐదుగురూ ఐదు మార్గాల్లో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్నోవా కారును కూడా నిందితులు దాచి పెట్టేశారు. ఈ కారుకు ప్రభుత్వ వాహనం అన్న స్టిక్కర్ మాత్రమే ఉందని.. ఆ కారు ఇంకా టెంపరరీ రిజిస్ట్రేషన్ మీదే ఉందని తెలుస్తోంది. మొత్తంగా నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నప్పటికీ.. వారంతా కలిసి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చాలా మార్గాలనే ఆశ్రయించారు.