Maha Shivarathri : నేడు మహా శివరాత్రి.. ఈరోజు ఉపవాసం ఎందుకుంటారంటే?

నేడు దేశ వ్యాప్తంగా మహా శివరాత్రి పండగను భక్తులు జరుపుకుంటున్నారు.;

Update: 2025-02-26 01:48 GMT
devotees, festiva, india,  maha shivaratri
  • whatsapp icon

నేడు దేశ వ్యాప్తంగా మహా శివరాత్రి పండగను భక్తులు జరుపుకుంటున్నారు. మాఘమాసంలో వచ్చే ఈ మహా శివరాత్రికి ప్రత్యేకత ఉంది. శివరాత్రికి ఉపవాసాలు ఉంటూ, శివధ్యానం చేయడం, జాగారం చేయడం సంప్రదాయంగా వస్తుంది. శివరాత్రి రోజు ఉపవాసం చేసి దైవారాధన చేస్తే పుణ్యం దక్కుతుందని, మరు జన్మ ఉండదని భక్తులు విశ్విసిస్తారు. అందుకే శివరాత్రి పండగ హిందువులకు ప్రత్యేకంగా చెప్పాలి. మాఘమాసంలొ వచ్చే మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగారం చేయడం కోసం ఎంతో మంది సంవత్సరమంతా ఎదురు చూస్తుంటారు. మాఘ మాసంలో వచ్చే శివరాత్రి తిథి నాడే పరమేశ్వరుడు జగన్మాతను వివాహమాడారని పురాణాలు చెబుతున్నాయి.

లింగోద్భవ సమయంలో...
ఈరోజే శివుడు అవతరించాడని కూడా అంటారు. లింగోద్భవ సమయంలో పూజలు చేస్తూ జాగరణ చేస్తూ, ఉపవాస దీక్ష చేస్తే మంచిదన్నది పండితుల సూచన. అందుకే ఎక్కువ మంది శివరాత్రి నాడు ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. మహా శివరాత్రి రోజు రాత్రి 11.30 గంటల నుంచి అర్థరాత్రి ఒంటిగంట మధ్య లింగోద్భవ కాలంగా భావిస్తారు. అప్పుడు పూజలు చేయడం వల్ల శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే నేటి రాత్రంతా జాగరణ చేస్తూ భజనలు చేస్తూ శివుడి అనుగ్రహం పొందేందుకు భక్తులు ప్రయత్నిస్తుంటారు. మరుసటి రోజు ఉదయం పండ్లు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు.
శైవ క్షేత్రాలన్నీ...
ఈరోజు శివరాత్రి కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం, శ్రీకాళహస్తి క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో వారు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఉచితంగా మజ్జిగను, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా ఆలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. శివరాత్రికి ఆర్టీసీ స్పెషల్ సర్వీస్ లను శైవక్షేత్రాలకు నడుపుతుంది. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నందున భక్తులు నేడు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది.


Tags:    

Similar News