జాగ్రత్త: సీబీఐ అధికారులమంటూ రెచ్చిపోతున్న మోసగాళ్లు

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారుల లాగా నటిస్తూ.. మోసానికి పాల్పడుతూ ఉన్నారు. సీబీఐ లోగోను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. సీబీఐ తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ మోసాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

Update: 2024-08-08 05:30 GMT
CBI

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారుల లాగా నటిస్తూ.. మోసానికి పాల్పడుతూ ఉన్నారు. సీబీఐ లోగోను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. సీబీఐ తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ మోసాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

మోసగాళ్లు తమ కార్యకలాపాలను నిర్వహించడానికి వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ డీపీగా CBI లోగో ఉంటుంది. సీబీఐ అధికారుల నకిలీ సంతకాలను ఉపయోగించి బాధితుల పేరు మీద వారెంట్లు, సమన్లు వంటి నకిలీ పత్రాలను పంపిస్తారు. సెలెక్ట్ చేసుకుని మరీ బాధితులని బెదిరించారు. సదరు వ్యక్తులు తమ డిమాండ్‌లకు కట్టుబడి ఉండకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నకిలీ సీబీఐ అధికారులు హెచ్చరిస్తారు.

తల్లిదండ్రుల్లో భయం:

మోసగాళ్లు బాధితుల తల్లిదండ్రులతో మాట్లాడి భయాందోళనకు గురిచేస్తూ ఉంటారు. ఇంటికి దూరంగా ఉంటున్న చిన్న పిల్లల తల్లిదండ్రులను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. పిల్లవాడు చట్టపరంగా ఇబ్బందుల్లో ఉన్నాడని, కొంత మొత్తాన్ని బదిలీ చేస్తే కేసు మాఫీ అవుతుందని తల్లిదండ్రులకు చెబుతున్నారు. మీ పిల్లలు చట్టపరంగా ఇరుక్కుంటే వారి కెరీర్ నాశనం అవుతుందంటూ బెదిరిస్తారు. ఉదాహరణకు, మీ పిల్లాడితో పాటు.. ఇంకొంత మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. తక్షణం డబ్బులు చెల్లించకుంటే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని బాధితులని బెదిరిస్తారు. త్వరితగతిన చర్యలు తీసుకోవాలని టెన్షన్ పెడతారు. ఎవరికైనా ఏమైనా డౌట్ వస్తే మాత్రం మోసగాళ్లు ఇక మిమ్మల్ని కాంటాక్ట్ చేయరు.

ప్రజలకు కీలక సూచన చేసిన సీబీఐ:

CBI తన సోషల్ మీడియా పోస్ట్ లో “సీబీఐ సీనియర్ అధికారుల పేర్లు, హోదాలను దుర్వినియోగం చేసే స్కామ్‌ల నుండి దయచేసి అప్రమత్తంగా ఉండండి. సీబీఐ డైరెక్టర్‌తో సహా సీబీఐ అధికారుల సంతకంతో కూడిన నకిలీ వారెంట్లు/సమన్లు చూపిస్తూ ఇంటర్నెట్/ఈమెయిల్స్/వాట్సాప్ మొదలైన వాటిలో మోసానికి పాల్పడుతూ ఉన్నారు.
ప్రధానంగా వాట్సాప్ ద్వారా కాల్‌లు చేయడానికి, డబ్బును లాగేసుకోడానికి.. కొంతమంది నిందితులు తమ డిస్‌ప్లే చిత్రంగా CBI లోగోను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాంటి ఏ ప్రయత్నం జరిగినా వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
కాల్‌లు లేదా వాట్సాప్ కాల్‌ల ద్వారా ఏదైనా కమ్యూనికేషన్‌ విషయంలో జాగ్రత్త వహించాలని ఏజెన్సీ ప్రజలకు సూచించింది. నిజమైన సీబీఐ అధికారులు ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా మీ వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని అడగరు.

WhatsApp-CBI స్కామ్‌ నివారించడం ఎలా: ముఖ్యమైన చిట్కాలు


అప్రమత్తంగా ఉండండి: ఫ్రాడ్ సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా CBI లేదా మరేదైనా సంస్థ నుండి వచ్చే మెసేజీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కాలర్‌ను ధృవీకరించండి:
అధికారిక మార్గాల ద్వారా సంబంధిత అధికారులను సంప్రదించడం ద్వారా ఏదైనా కమ్యూనికేషన్ కు సంబంధించిన ప్రామాణికతను ఎల్లప్పుడూ క్రాస్-చెక్ చేసుకోవాలి.
నకిలీ లింక్‌ల పట్ల జాగ్రత్త వహించండి: తెలియని, అనుమానాస్పద లింక్‌లు లేదా అటాచ్‌మెంట్‌లపై క్లిక్ చేయవద్దు. ఇది హానికరమైన సాఫ్ట్‌వేర్ కావచ్చు.
వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండి: వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను తెలియని వ్యక్తులతో లేదా ధృవీకరించని ప్లాట్‌ఫారమ్‌లతో పంచుకోకండి.
అనుమానాస్పద కార్యాచరణను నివేదించండి: మీకు అనుమానాస్పద సందేశం లేదా CBI నుండి వచ్చినట్లు క్లెయిమ్ చేసే కాల్ వస్తే, వెంటనే స్థానిక పోలీసులకు నివేదించండి.
Two-Factor Authentication చాలా ముఖ్యం: మీ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి టూ ఫ్యాక్టర్ అథేంటికేషన్ ఉత్తమ మార్గం.

అనుమానాస్పద కాల్ వచ్చినప్పుడు:


మీకు అనుమానాస్పద కాల్ వచ్చినప్పుడు, తప్పనిసరిగా వాట్సాప్‌కు రిపోర్ట్ చేయాలి. కాల్ సమయంలో మూడు చుక్కలపై క్లిక్ చేసి, 'రిపోర్ట్' ఎంచుకోండి. స్థానిక పోలీసులకు నివేదించడం కూడా చాలా అవసరం, తద్వారా అధికారులు మోసగాళ్లను ట్రాక్ చేయవచ్చు. ఇతరులను స్కామ్ బారిన పడకుండా కాపాడవచ్చు. భవిష్యత్తులో కాల్‌లను నిరోధించడానికి ఆ ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయాలి.
డిజిటల్ భద్రత ముఖ్యం:
తెలియని నెంబర్ల నుండి వచ్చే ఫోన్ కాల్‌లను స్వీకరించడం వల్ల కలిగే సమస్యల గురించి అందరికీ అవగాహన కలిగించాలి. ఆన్ లైన్ బెదిరింపులకు సంబంధించి పిల్లలు, సీనియర్ సిటిజన్‌లకు అవగాహన కల్పించాలి. ఆన్‌లైన్ భద్రత గురించి వారికి సూచించాలి. ఆన్‌లైన్‌లో అపరిచితులతో ఎటువంటి సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదు. స్కామ్‌ల విషయంలో జరిగే ప్రమాదాలకి సంబంధించి అవగాహనను పెంచాలి. ఇలాంటి బెదిరింపులు ఎదురైనప్పుడు ఒక్క నిమిషం ఆగి పరిస్థితి వాస్తవమా.. ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా అనే దాని గురించి ఆలోచించాలి.
Tags:    

Similar News