ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి, సీవీఆర్ ఛానల్ చైర్మన్ సీవీ రావుతో పాటు మరో ముగ్గురిని జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యత్వం నుంచి తొలగించారు. ఆదివారం నిర్వహించిన జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ జనరల్ బాడీ సమావేశంలో సొసైటీ నియమాలు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐదుగురు సంఘ సభ్యులను సొసైటీ సభ్యత్వం నుండి తొలగిస్తూ.. ఏకగ్రీవంగా తీర్మానించారు. తెలంగాణ రాష్ట్ర సహకార చట్టంలోని సెక్షన్ 21 నిబంధనలకు విరుద్ధంగా వీరు ప్రవర్తించారని సంఘం సభ్యులు తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం.. NTV చైర్మన్ T. నరేంద్ర చౌదరి, CVR ఛానల్ చైర్మన్ CV రావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ T. హనుమంత రావు, ప్రస్తుత సెక్రటరీ A. మురళీ ముకుంద్, కిలారి రాజేశ్వరరావు ఇకపై సొసైటీలో సభ్యులుగా ఉండరు. వారు జూబ్లీ హిల్స్ క్లబ్ సభ్యత్వాన్ని కూడా కోల్పోతారు.
ఏప్రిల్ 2022లో, ఆదాయపు పన్ను శాఖ నిబంధనలకు విరుద్ధంగా సొసైటీలోని 11 ఆస్తులను అక్రమంగా అధిక ధరకు అమ్మేసినట్లు గుర్తించింది. ఆగస్ట్ 2021-మార్చి 2022 మధ్య, సొసైటీకి 1988 బినామీ ప్రాపర్టీ లావాదేవీల నిషేధ చట్టం కింద ఆదాయపు పన్ను శాఖ నుండి ఐదు నోటీసులు అందాయి. సెప్టెంబరు 2021 నుండి డిసెంబర్ 2021 మధ్యకాలంలో ఎ.మురళీ ముకుంద్‌పై ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అయితే తెలంగాణ కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్ ఆయన సెక్రటరీ పదవిని కొనసాగించింది.
సొసైటీ అధ్యక్షుడు బి.రవీంద్రనాథ్ మాట్లాడుతూ 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా 750 మందికి పైగా సభ్యులు ఈ సర్వసభ్య జనరల్ బాడీ సమావేశానికి హాజరయ్యారన్నారు. సొసైటీ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను అతి తక్కువ ఖర్చుతో చేపట్టేందుకు నాస్కామ్(Nasscom) సహకారంతో పలు ఐటీ సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. డిజిటలైజేషన్ చేస్తే ఎటువంటి అక్రమాలు, తప్పుడు లావాదేవీలకు అవకాశం ఉండదని వెల్లడించారు. సొసైటీ సభ్యుల ఆరోగ్య అవసరాల కోసం అపోలో హాస్పిటల్స్ హెల్త్ కార్డులను కూడా జారీ చేయనున్నట్లు తెలిపారు. సభ్యుల అత్యవసర అవసరాల కోసం అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచినట్లు సంఘం అధ్యక్షులు తెలిపారు. KYC పత్రాలు సమర్పించిన సభ్యులకు స్మార్ట్ కార్డులు అందించనున్నారు. లారస్ ల్యాబ్స్ చైర్మన్ సి.సత్యనారాయణ అంబులెన్స్‌ను సొసైటీకి అందజేశారు. ఇక జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. సభ్యత్వాలు, ప్లాట్ల విక్రయం, నాయకత్వ సమస్యలు, ఎన్నికలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.