Ayodhya : అయోధ్యకు హైదరాబాద్ నుంచి కాలినడకన బయలుదేరి.. రాముల వారికి బంగారు పాదుకలు తీసుకుని
అయోధ్యలోని రాముడికి బంగారు పాదుకలను అందించేందుకు హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి కాలికనడకన బయలుదేరారు.
Ayodhya Ram Mandir:దేశంలో రామాలయం లేని ఊరు ఉండదు. రాముడు అంటే అందరికీ దేవుడు. హిందువులు ప్రధానంగా ఆరాధించే రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఈ నెల22వ తేదీన విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. అందుకోసం దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. అయోధ్య రాముడిని ఒక్కసారి దర్శించుకోవాలని అందరూ కోరుకుంటారు. అప్పుడే జన్మ సార్థకత అవుతుందని భావిస్తారు. అందులో భాగంగా తమకు తోచిన సాయాన్ని తాము చేసేందుకు కూడా సిద్ధపడతారు. అందుకు వ్యయం కోసం వెరవరు. శ్రమ ఉంటుందని సందేహించరు. రాముడిని చేరుకోవడమే లక్ష్యంగా కొందరు ఎంతటి సాహసానికైనా ఒడిగడతారు.
పాదుకలను నెత్తిన పెట్టుకుని...
అలాంటి సాహసమే హైదరాబాద్ వాసి ఒకరు చేయడం విశేషం. అయోధ్యలోని రాముడికి బంగారు పాదుకలను అందించేందుకు హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి కాలికనడకన బయలుదేరారు. హైదరాబాద్ లో రాముడి పాదుకలను నెత్తిన పెట్టుకుని బయలుదేరిన చల్లా శ్రీనివాస శాస్త్రి ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ లోని చిత్రకూట్ కు చేరుకున్నారు. వేలాది కిలోమీటర్లను అవలీలగా కాలినడకన ప్రయాణించారు. ఈ నెల 17 లేదా 18వ తేదీ నాటికి ఆయన అయోధ్య చేరుకునే అవకాశాలున్నాయి. దాదాపు ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు.
పది రోజులలో....
బంగారు పాదుకలను నేరుగా ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కు అందివ్వనున్నారు. బంగారు పాదుకలను తయారు చేయించి శ్రీరాముడికి ఇవ్వాలన్న కోరికను ఆయన నెరవేర్చుకోనున్నారు. ఆయనకు కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభించడంతో పాదుకలను తీసుకుని అయోధ్యకు చేరువలో ఉన్నారు. చల్లా శ్రీనివాస్ శాస్త్రి తండ్రి కూడా శ్రీరాముడు భక్తుడట. ఆయన అయోధ్య లో జరిగిన కరసేవలో పాల్గొన్నారని చెబుతున్నారు. తన తండ్రి కల నెరవేర్చేందుకే తాను అయోధ్యకు బయలుదేరి వెళ్లానని, 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాను త్వరలోనే అయోధ్యకు చేరుకుంటానని ఆయన చెబుతున్నారు. మొత్తం మీద సాహసం చేసి బంగారు పాదుకలను తలపై పెట్టుకుని పాదయాత్రగా వెళుతున్న చల్లా శ్రీనివాస్ శాస్త్రిపై ప్రశంసలు కురుస్తున్నాయి.