నిజాం ఖడ్గాన్ని తిరిగి ఇచ్చేసిన యూకే.. త్వరలో హైదరాబాద్ కు..!

14వ శతాబ్దానికి చెందిన కత్తి తిరిగి భారత్ కు వచ్చింది. 115 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ఆర్మీ జనరల్‌కు ఆరవ నిజాంకు చెందిన

Update: 2022-09-25 05:30 GMT

14వ శతాబ్దానికి చెందిన కత్తి తిరిగి భారత్ కు వచ్చింది. 115 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ఆర్మీ జనరల్‌కు ఆరవ నిజాంకు చెందిన ఓ ఉన్నత అధికారి విక్రయించారా లేదా బహుమతిగా ఇచ్చారా అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ ఖడ్గం పాము ఆకారంలో ఉంది. ఇది భారతదేశానికి తిరిగి వచ్చింది. హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని ఏలిన నిజాంలకు చెందిన అరుదైన, పాము ఆకార ఖడ్గం ఇది. ఇండో–పర్షియన్‌ డిజైన్, రంపపు పళ్ల తరహాలో రెండు వైపులా పదునైన మొనలు ఉన్నాయి. బంగారు పూత పూసిన ఏనుగు, పులి బొమ్మలతో కూడిన ఈ ఖడ్గం 117 ఏళ్ల తర్వాత యూకే నుంచి తిరిగి భారత్‌కు చేరుకుంది. త్వరలోనే హైదరాబాద్ నగరానికి చేరుకోనుంది. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలోని కెల్వింగ్‌రోవ్ ఆర్ట్ గ్యాలరీ, మ్యూజియంను నిర్వహించే గ్లాస్గో లైఫ్ ద్వారా భారతదేశానికి తిరిగి వచ్చిన ఏడు వస్తువులలో ఈ తల్వార్ కూడా ఒకటి.

క్రీస్తు శకం 1,350లో తయారైన ఈ కరవాలాన్ని 1896 నుంచి 1911 మధ్య హైదరాబాద్‌ సంస్థానాన్ని పాలించిన ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ పలు వేడుకల్లో ప్రదర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1903లో భారత్‌ను పాలించే బ్రిటిష్‌ చక్రవర్తిగా కింగ్‌ ఎడ్వర్డ్‌–7, క్వీన్‌ అలెగ్జాండ్రల పట్టాభిషేక మహోత్సవం ఢిల్లీ దర్బార్‌లో అట్టహాసంగా జరిగిందని, ఈ వేడుకలో పాల్గొన్న సందర్భంగా మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ ఈ ఖడ్గాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. ఈ ఖడ్గం సహా మరికొన్ని విలువైన వస్తువులను చోరీకి గురైన వస్తువులుగా ప్రభుత్వం చెబుతోంది. అయితే 1905లో నాటి బ్రిటిష్‌ సైన్యంలోని బాంబే కమాండ్‌కు చెందిన కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ సర్‌ హంటర్‌ దీన్ని హైదరాబాద్‌ సంస్థాన ప్రధాని బహదూర్‌ నుంచి కొనుగోలు చేశారని బ్రిటీషర్లు చెబుతున్నారు. 1978లో ఆయన మేనల్లుడు ఈ ఖడ్గాన్ని స్కాట్లాండ్‌లోని గ్లాస్గో లైఫ్‌ మ్యూజియంకు దానం చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఈ ఖడ్గాన్ని భారత్ కు తిరిగి తీసుకుని రావడానికి.. ఆగస్ట్ 19న మ్యూజియం అధికారులతో UKలోని భారత హైకమిషన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా భారత్‌కు చెందిన 7 చారిత్రక వస్తువులను స్కాట్లాండ్‌ గత నెలలో తిరిగి అప్పగించింది. ఆ ఏడు వస్తువుల్లో నిజాం కాలంనాటి పాము ఆకార ఖడ్గం, 10వ శతాబ్దానికి చెందిన సూర్యదేవుని విగ్రహం మొదలైనవి ఉన్నాయి.
ఈ కత్తి హైదరాబాద్‌కు పుట్టినిల్లుగా ఉండడంతో అక్కడికి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సాలార్‌జంగ్ మ్యూజియం డైరెక్టర్ ఎ.నాగేందర్ రెడ్డి తెలిపారు. "కత్తి ఎప్పుడు వచ్చినా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని ఆయన చెప్పారు. ఈ ఖడ్గం ఇండో-పర్షియన్ డిజైన్‌లో ఉంది. పాము ఆకారంలో ఉంది. ఏనుగు, పులి బొమ్మలు కూడా అందులో ఉన్నాయి. దాదాపు 1350 కాలం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు.


Tags:    

Similar News