రష్యాలో విక్టరీ డే ఉత్సవాలు.. పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగబోతున్నారా..?
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ప్రతి ఏడాది మే 9 న 'విక్టరీ డే' జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో పాల్గొననున్న పుతిన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.;
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ప్రతి ఏడాది మే 9 న 'విక్టరీ డే' జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో పాల్గొననున్న పుతిన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. 11 వారాలుగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న పోరును పూర్తిస్థాయి యుద్ధంగా మారుస్తున్నట్టు ఆయన ప్రకటించే అవకాశం ఉందని ప్రపంచ మీడియా చెబుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నాజీలపై పోరుగా అభివర్ణిస్తూ వెంటనే సైనిక బలాల్లో చేరాలంటూ పౌరులకు పిలుపునిచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద నేడు ఆయన చేయనున్న 'విక్టరీ డే' ప్రసంగంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. నాజీయిజం మళ్లీ పురుడుపోసుకోకుండా అడ్డుకుందామని అజర్‌బైజాన్, ఆర్మేనియా, బెలారస్, కజఖ్‌స్థాన్, కిర్గిజిస్థాన్, తజకిస్థాన్ తదితర కామన్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ దేశాల ప్రజలకు పుతిన్ పిలుపునిచ్చారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం నాడు నాజీ జర్మనీ ఓడిపోయి 77వ వార్షికోత్సవం సందర్భంగా మాజీ సోవియట్ దేశాలకు అభినందనలు తెలుపుతూ "1945లో మాదిరిగానే, విజయం మనదే" అని ప్రతిజ్ఞ చేశారు. మన సైనికులు.. వారి పూర్వీకులు 1945 లో విహాయం సాధించినట్లుగానే ఇప్పుడు కూడా విజయం మనదేనని అన్నారు. అప్పట్లో ఎంతో విశ్వాసంతో నాజీల నుండి తమ మాతృభూమిని విముక్తి చేయడానికి పోరాడారని గుర్తు చేశారు. వివిధ దేశాల ప్రజలను ఇన్ని కష్టాలకు గురిచేసిన నాజీయిజం మళ్లీ పుట్టకుండా నిరోధించడం ఈరోజు మన ఉమ్మడి కర్తవ్యమని పుతిన్ అన్నారు. లెక్కలేనన్ని త్యాగాలతో నాజీయిజాన్ని ధ్వంసం చేసిన సైనికుల గురించి మాత్రమే కాకుండా పౌరుల గురించి కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. రష్యా, ఉక్రెయిన్ తూర్పున ఉన్న రష్యన్ మాట్లాడే మైనారిటీకి ముప్పు అని చెప్పారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన వారి సైద్ధాంతిక వారసులను నిలువరించడం మన కర్తవ్యమని పుతిన్ అన్నారు.
ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్ ప్రకటించి సంగతి తెలిసిందే. ఈ చర్యల కారణంగా ఉక్రెయిన్‌లో వేలాది మంది పౌరులు, సైనికులు మరణించారు. దాదాపు 10 మిలియన్ల మంది తమ సొంత ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తాజాగా ఓ వీడియోని విడుదల చేశారు. చెడు మళ్లీ తిరిగి వచ్చిందని, కాకపోతే అది వేరే రూపంలో, వేర్వేరు నినాదాలతో వచ్చిందని రష్యాను విమర్శించారు. కానీ ప్రయోజనం మాత్రం అదేనని ఆయన అన్నారు. ఈ సారి ఉక్రెయిన్ దాని మిత్రదేశాలు ఇందులో గెలుస్తాయని, మంచిపై చెడు ఎన్నడూ విజయం సాధించదన్నారు.