లంకలో కరెంట్ పోయింది.. వానరమే కారణం
శ్రీలంకలో కొన్ని గంటల పాటూ కరెంట్ పోయింది;

శ్రీలంకలో కొన్ని గంటల పాటూ కరెంట్ పోయింది. కొలంబో దక్షిణ ప్రాంతంలోని విద్యుత్తు వ్యవస్థలోకి ఓ కోతి చొరబడింది. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాలకు 10 గంటలు దాటినా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. గ్రిడ్‌లోని ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఓ వానరం తాకడం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థలలో అసమతుల్యత ఏర్పడిందని ఆ దేశ విద్యుత్తు శాఖ మంత్రి కుమార జయకోడి తెలిపారు. కోతి ప్రవేశం వల్ల జరిగిన నష్టం, డ్యామేజీని సరిదిద్దడానికి తమ ఇంజినీర్లు శ్రమించాల్సి వచ్చిందని అన్నారు.
ఫిబ్రవరి 9, ఆదివారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం11 గంటల సమయంలో శ్రీలంకలో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. శ్రీలంకలో పవర్ గ్రిడ్‌ను ఆధునీకరించాలని, లేకపోతే తరచుగా విద్యుత్ అంతరాయాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. 2022లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత శ్రీలంక తరచుగా విద్యుత్ సరఫరాలో అంతరాయాల్ని ఎదుర్కొంటోంది.