
బందీల విడుదల ఆలస్యం చేస్తామని హమాస్ చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాస్‌కు ఏకంగా డెడ్‌లైన్ విధించారు. శనివారం నాటికి బందీలందరినీ విడుదల చేయకపోతే నరకం చూపిస్తానంటూ హెచ్చరించారు. కాల్పుల విరమణ విషయంలో అంతిమంగా ఏం జరగాలనేది ఇజ్రాయెల్ నిర్ణయమని, శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు బందీలందరినీ విడుదల చేయాలని ట్రంప్ సూచించారు.
గాజా కాల్పులకు విరమణను ఇజ్రాయెల్ లెక్క చేయడం లేదని, ఎప్పటిలానే అక్కడ దాడులు చేస్తోందని హమాస్ ఆరోపిస్తోంది. అందుకే తాము బందీల విడుదల ఆలస్యం చేస్తామని ప్రకటించింది. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజా నుంచి హమాస్ విడుదల చేస్తున్న బందీలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. 491 రోజుల పాటు సరైన ఆహారం లేక కృశించిపోయిన వారిని చూస్తుంటే మనసు చలిపోతోందని అన్నారు. ఇక గాజాను స్వాధీనం చేసుకుని పునర్‌నిర్మిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రతిపాదించారు. దీనికి పాలస్తీనియన్లు నిరాకరిస్తే మిత్రదేశాలైన జోర్దాన్, ఈజిప్ట్‌లకు అందించే సహాయాన్ని నిలిపివేస్తానని కూడా హెచ్చరించారు.