మహిళలు ఐస్ క్రీమ్ తినడం.. అదే అక్కడ తప్పైపోయింది
దేశంలోని హిజాబ్, పవిత్రత చట్టాలను బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా.. ఇరాన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
మహిళలు ఐస్‌క్రీం తింటున్నట్టుగా ఇటీవల విడుదలైన మాగ్నమ్ బ్రాండ్‌కు చెందిన రెండు ప్రకటనలు ఇరాన్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ యాడ్స్‌లో మహిళలను అభ్యంతరకరంగా చూపించారని, హిజాబ్ పద్ధతులు పాటించలేదంటూ మతపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై మహిళలు ప్రకటనల్లో నటించడానికి వీల్లేదంటూ ఆ దేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని యాడ్ ఏజెన్సీలకు ఇరాన్ సాంస్కృతిక శాఖ రాసిన లేఖలో ఇకపై ఎలాంటి ప్రకటనల్లోనూ నటించేందుకు మహిళలకు అనుమతి లేదని పేర్కొంది.
దేశంలోని హిజాబ్, పవిత్రత చట్టాలను బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా.. ఇరాన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మహిళలు ప్రకటనలలో కనిపించకుండా నిషేధించింది. రేడియో ఫ్రీ యూరప్ ప్రకారం, మహిళలు ఇకపై ఎలాంటి వాణిజ్య ప్రకటనలలో నటించడానికి అనుమతించబడరని మంత్రిత్వ శాఖ కంపెనీలకు ఒక లేఖలో తెలియజేసింది. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రెవల్యూషన్ తీర్పులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి చేశామని అందులో సాంస్కృతిక శాఖ పేర్కొంది.
ఒక మహిళ మాగ్నమ్ ఐస్‌క్రీమ్‌ను కొరికే వాణిజ్య ప్రకటన ఇరాన్ లో వివాదమైంది. ఇస్లామిక్ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియోపై ఇరాన్ మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐస్ క్రీమ్ తయారీదారు డొమినోపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రకటన ప్రజల మర్యాదకు విరుద్ధమని, మహిళల నైతికతను అవమానించేలా ఉందని చెప్పుకొచ్చారు.
ఇంతకూ ఆ యాడ్ లో ఏముందంటే.. ఓ మహిళ ఒక్కరే కార్ లో కూర్చుని నవ్వుకుంటూ వస్తూ ఉంటుంది. పక్కన సీట్ లో చూసి నవ్వుతూ ఉంటుంది. ఊరికి దూరంగా వచ్చి.. ఓ పెట్టెలో ఉన్న ఐస్ క్రీమ్ ను తీసి తినడం మొదలుపెట్టింది. మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ ను ఆ మహిళ ఆస్వాదిస్తూ కనిపించింది. ఇప్పుడు ఈ యాడ్ ఇరాన్ లో అత్యంత వివాదాస్పదమైంది.