కాబూల్ లో స్కూళ్ల పై ఉగ్రదాడి.. పదుల సంఖ్యలో విద్యార్థులు మృతి
రెండు పాఠశాలలపై ఆత్మాహుతి దాడికి పాల్పడగా పదుల సంఖ్యలో విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది.
కాబూల్ : తాలిబన్ల రాజ్యమైన ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రమూక రెచ్చిపోయింది. రెండు పాఠశాలలపై ఆత్మాహుతి దాడికి పాల్పడగా పదుల సంఖ్యలో విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. ముందుగా ముంతాజ్ స్కూల్లో దాడి జరగగా.. వెంటనే సరిహద్దుల్లోని దష్తీ బార్చిలో ఉన్న అబ్దుల్ రహీం షాహిద్ అనే పాఠశాల బయట రెండు ఐఈడీలతో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడినట్టు ఖాలిద్ జద్రాన్ అనే పోలీస్ అధికారి చెప్పారు. ఈ పేలుళ్లలో 10 మందికి పైగా విద్యార్థులు మరణించినట్లు వెల్లడించారు.
రెండు దాడి ఘటనల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాగా.. ఈ దాడి ఐఎస్ ఉగ్రవాదుల పనిగా అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గతేడాది మే నెలలో ఇదే ప్రాంతంలోని ఓ స్కూల్ లో జరిగిన పేలుళ్లలో 85 మంది మరణించగా.. 300 మంది గాయపడ్డారు. తాజా ఘటనతో కాబూల్ ఉలిక్కిపడింది.