America : అమెరికాలో ఉపాధ్యక్షుడు మన ఇంటి అల్లుడే మరి
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఉపాధ్యక్షుడు కానున్న జేడీ వాన్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడయ్యారు. గతంలో ఎన్నడూ లేనంత భారీ మెజారిటీతో విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికా ఉపాధ్యక్షుడు కానున్న జేడీ వాన్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. జేడీ వాన్స్ అమెరికా పౌరుడే. అయితే మన ఇంటి అల్లుడు. ఆంధ్రావారి అల్లుడు. జేడీ వాన్స్ భార్య ఉష చిలుకూరి తెలుగు సంతతికి చెందిన వారు. ఇద్దరు కళాశాలలో ప్రేమించుకుని ఒకటయ్యారు. ఉషా చిలుకూరిని ప్రేమ వివాహం చేసుకున్న జేడీ వాన్స్ అమెరికాకి ఉపాధ్యక్షుడుగా మారాడు. నిజంగా ఇది తెలుగు వారందరికీ గర్వకారణమే.
ఉషా చిలుకూరి భర్త...
అమెరికా ఎన్నికల్లో తెలుగు వారు క్రియాశీలకంగా మారారు. ఆరుగురు భారతీయ సంతతికి చెందిన వారు గెలిచి చూపించారు కూడా. అదే సమయంలో స్వింగ్ స్టేట్స్ లోనూ తెలుగు వారు రిపబ్లికన్ పార్టీకి అండగా నిలిచారు. ఇక జేడీ వాన్స్ విషయానికి వస్తే ఉషా చిలుకూరి భర్త. అయితే ఉషా చిలుకూరి తల్లిదండ్రులు అమెరికాకు ఉద్యోగ నిమిత్తం వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జేడీ వాన్స్ ను పెళ్లి చేసుకున్న ఉషా చిలుకూరి విశాఖ వాసులకు దగ్గర బంధువు. ఉషా చిలుకూరి విశాఖలో ఆంధ్రయూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిన శాంతమ్మమనవరాలు. శాంతమ్మ తొమ్మిది పదుల వయసులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉషాచిలుకూరికి ఇప్పటికీ విశాఖలో దగ్గర బంధువులున్నారు.
విశాఖ వాసులతో బంధుత్వం...
శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్యణ్యశాస్త్రి కొన్నేళ్ల క్రితం మరణించారు. సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ కుమార్తె ఉష. అయితే తన మనవడిని రిపబ్లికన్ పార్టీ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేయడంపై శాంతమ్మ సంబరపడిపోతున్నారు. వరసకు శాంతమ్కకు జేడీ వాన్స్ మనవడు అవుతారు. ఊషా చిలుకూరి స్వగ్రామం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం. వారి పూర్వీకులందరూ అక్కడే ఉండేవారు.ముత్తాత వీరావధాన్లుకు ఐదుగురు సంతానం కాగా అందులో రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణమూర్తి అందరూ ఉన్నత విద్యావంతులే.
అమెరికాలో స్థిరపడి...
రామశాస్త్రి మద్రాసు వలస వెళ్లిపోయి ఐఐటీ మద్రాసులో ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయన భార్య బాలాత్రిపుర సుందరి కాగా, వీరికి అవధాని, నారాయణశాస్త్రి, రాధాకృష్ణ అనే ముగ్గురు కుమారులున్నారు. శారద ఒక్కగానొక్క కుమార్తె. ముగ్గురు కుమారులూ అమెరికాలో స్థిరపడగా శారద మాత్రం చెన్నైలో నివాసం ఉంటూ వైద్యురాలిగా స్థిరపడ్డారు. ఏరో నాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన రాధాకృష్ణ శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. పామర్రుకు చెందిన లక్ష్మితో ఆయనకు వివాహం కాగా వారి సంతానమే ఉష. ఉష ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి అయింది. దీంతో ఆ గ్రామంలోనూ ఆనందం వెల్లివిరుస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో క్రియాశీలకంగా మారిన భారతీయ సంతతికి చెందిన వారు అధికంగా ఉండటమే కాకుండా ఉపాధ్యక్షుడిగా తెలుగువారి మనవరాలి భర్త కావడం ఆనందదాయకమే.