గిన్నిస్ రికార్డుకెక్కిన 119 ఏళ్ల కానే టనాకా కన్నుమూత

నైరుతి జపాన్ లోని పుకోకా పట్టణానికి చెందిన కానే 116 ఏళ్ల వయసులో మార్చి 2019లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న..

Update: 2022-04-26 05:32 GMT

జపాన్ : ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా 2019లో గిన్నిస్ రికార్డులకెక్కిన జపాన్ కు చెందిన కానే టనాకా(119) ఇక లేరు. ఈనెల 19న ఆమె తుదిశ్వాస విడిచినట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. నైరుతి జపాన్ లోని పుకోకా పట్టణానికి చెందిన కానే 116 ఏళ్ల వయసులో మార్చి 2019లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా కానే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత.. 117 సంవత్సరాల 261 రోజుల వయసులో అత్యంత ఎక్కువ కాలం జీవించిన జపాన్ వ్యక్తిగా, ప్రపంచంలోనే సుదీర్ఘకాలం జీవించిన రెండో వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకున్నారు.

గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న సందర్భంగా.. కానే తన జీవిత రహస్యాన్ని పంచుకున్నారు. సోడా, చాక్లెట్‌తోపాటు రుచికరమైన ఆహారం తీసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడమే తాను సుదీర్ఘంగా బతకడానికి కారణమని కానే చెప్పేవారు. 1903వ సంవత్సరం జనవరి రెండో తేదీన కానే జన్మించారు. అదే ఏడాది రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టారు. 19 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఆమెకు నలుగురు సంతానం కాగా, మరొకరిని దత్తత తీసుకున్నారు. ఆమె భర్త 1937లో చైనా-జపాన్ యుద్ధంలో పాల్గొన్నారు. కానే చనిపోవడంతో.. ఇప్పుడు ఫ్రాన్స్ కు చెందిన లుసిలీ రాండన్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధవ్యక్తిగా నిలిచారు. లుసిలీ వయసు ప్రస్తుతం 118 సంవత్సరాల 73 రోజులు.


Tags:    

Similar News