Maharashatra Assmbly Elections : నన్ను గెలిపిస్తే పెళ్లి కాని వారికి పెళ్లి చేస్తా? విచిత్రమైన హామీ కదూ?
మహారాష్ట్ర ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ శరద్ చంద్ర పవార్ పార్టీ అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ విచిత్రమైన హామీ ఇచ్చారు
ఎన్నికల్లో ఈ మధ్య మరీ లోతుగా వెళ్లి రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తున్నారు. జాతీయ పార్టీలే గ్యారంటీల పేరుతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఉచిత హామీలను ఇస్తూ తాము అధికారంలోకి రాగానే తాము వాటిని అమలు చేస్తామని నమ్మబలుకుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు గతంలో మాదిరిగా పనికొచ్చే పనులు కాదు.. అంతా ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అనే పదం రాజకీయ పార్టీల నేతల నోటి నుంచి ఎన్నికల వేళ ఊతపదంగా మారింది. ప్రజలు కూడా ఉచితాలకే జై కొడుతుండటంతో రాజకీయ పార్టీలు కూడా తమకు తోచినట్లుగా హామీలు గుప్పించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎన్నికలు రసవత్తరంగా...
మహారాష్ట్ర ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. కూటమిలను ఏర్పాటు చేసుకుని అధికారాన్ని కైవసం చేసుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను ఇప్పటికే ఇచ్చింది. మహారాష్ట్రలోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. ఇటు బీజేపీ కూటమి కూడా ఉచిత హామీలు ఇచ్చేందుకు సిద్ధమయింది. కూటమిలోని ఏ పార్టీకి ఆ పార్టీ తమకు అనుకూలంగా మ్యానిఫేస్టోను కూడా ప్రత్యేకంగా రూపొందించి విడుదల చేస్తున్నాయి. మ్యానిఫేస్టోల రూపకల్పనకు కూడా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకున్నారు.
తనను గెలిపిస్తే...
ఇదిలా ఉంటే ఎవరికి వారే తమ నియోజకవర్గంలో గెలిచేందుకు అనేక తంటాలు పడుతున్నారు. అలివికాని వాగ్దానాలు చేస్తున్నారు. అందులో భాగంగా మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని పర్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ధంజయ్ ముండేపై పోటీ చేస్తున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ శరద్ చంద్ర పవార్ పార్టీ అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ విచిత్రమైన హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే అబ్బాయిలందరికీ పెళ్లి చేస్తానని విచిత్రమైన హామీ ఇచ్చారు. ఆయన తన ప్రచారంలో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే.. అబ్బాయిలందరికీ పెళ్లిళ్లు చేస్తానంటూ ఆయన హామీ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అబ్బాయిలందరికీ ఉద్యోగం ఇప్పిస్తానంటూ అని హామీ ఇస్తున్నారు. గతంలో రాజేసాహెబ్ దేశ్ ముఖ్ కాంగ్రెస్ బీడ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.