2023 Rewind : ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సినీ తారలు వీరే..

ఈ ఏడాది టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ తో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన పలువురు తారలు కూడా పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

Update: 2023-12-31 14:55 GMT
2023 Rewind : ఈ ఏడాది టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ తో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన పలువురు తారలు కూడా పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అలా ఈ ఏడాది ఒక ఇంటివారైన తారలు ఎవరో ఈ ఆర్టికల్ చదివేసి తెలుసుకోండి.
శర్వానంద్-రక్షితా రెడ్డి..
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేస్తూ ఏడడుగులు వేసేశారు. ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వారసురాలు అయిన 'రక్షితా రెడ్డి'ని శర్వానంద్ జూన్ 3న పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా జరిగింది.
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి..
మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. దాదాపు ఆరేళ్ళు సీక్రెట్ లవ్ స్టోరీ నడిపి ఈ ఏడాది నవంబర్ 1న పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ మెగా వెడ్డింగ్ ఇటలీలో ఘనంగా జరిగింది.
మంచు మనోజ్-మౌనిక రెడ్డి..
మంచు మనోజ్, భూమా మౌనిక ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. ఈ ఏడాది వివాహం చేసుకున్నారు. మార్చి 3న హైదరాబాద్ లో మంచు లక్ష్మీ ఇంటిలో ఈ వివాహం జరిగింది. అయితే వీరిద్దరికి గతంలో విడివిడిగా పెళ్లి అయ్యింది. ఇప్పుడు ఇది రెండో పెళ్లి.
నరేష్-పవిత్ర లోకేష్..
సీనియర్ యాక్టర్స్ నరేష్, పవిత్ర లోకేష్ తమ పెళ్లితో ఈ ఏడాది ఎంత వైరల్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్చి 10న ఈ సీనియర్ జంట ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. కాగా నరేష్ ఇది నాలుగో వివాహం అయితే పవిత్ర లోకేష్ కి ఇది రెండో వివాహం. ఇక ఈ పెళ్లి పై ఓ సినిమా తెరకెక్కించి 'మళ్ళీ పెళ్లి' అనే టైటిల్ ఆడియన్స్ ముందుకు కూడా తీసుకు రావడం విశేషం.

 

దగ్గుబాటి పెళ్ళిసందడి..
దగ్గుబాటి సురేష్ రెండో కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్.. తన బంధువుల కుటుంబానికి చెందిన 'ప్రత్యూష' అనే అమ్మాయిని వివాహమాడారు. డిసెంబరు 6న శ్రీలంకలో అభిరామ్, ప్రత్యూష మెడలో మూడుముళ్లు వేశారు.

 

అమలా పాల్ రెండో పెళ్లి..
2014లో తమిళ దర్శకుడి 'విజయ్'ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న అమలా పాల్.. ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకున్నారు. తన బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్‌ ని నవంబర్ 5న కోచిలో వివాహం చేసుకున్నారు.
కార్తీక పెళ్లి జోష్..
నాగచైతన్య జోష్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక.. రోహిత్ మీనన్‌ అనే వ్యక్తిని నవంబర్ 19న కేరళలోని త్రివేండ్రంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలు మానేసిన ఈ కార్తీక.. దుబాయిలో బిజినెస్ ఉమెన్ గా మారిపోయారు.
రాహుల్-అతియా శెట్టి..
భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ తో లవ్ స్టోరీ నడిపిన బాలీవుడ్ హీరోయిన్ అతియాశెట్టి.. జనవరి 23న రాహుల్ తో ఏడడుగులు వేశారు. అతియాశెట్టి తండ్రి సునీల్ శెట్టి.. ముంబయిలోని తన ఫామ్‌హౌస్ జహాన్‌ లో ఈ వివాహం ఘనంగా చేశారు.
కియారా అద్వానీ-సిద్ధార్ధ్ మల్హోత్రా..
ఇక ఈ ఏడాది మోస్ట్ గూగుల్ సెర్చ్ కపుల్ అంటే కియారా అద్వానీ, సిద్ధార్ధ్ మల్హోత్రా. షేర్షా సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరు సీక్రెట్ ప్రేమాయణం నడిపి.. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని కోటలో వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా..
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా తమ లవ్ స్టోరీకి ఎండ్ కార్డు వేస్తూ.. సెప్టెంబర్ 24న ఏడడుగులు వేసి మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేశారు. వీరి వివాహం కూడా రాజస్థాన్‌ కోటలోనే వైభవంగా జరిగింది.
Tags:    

Similar News