Ayodhya : భూమి కొనాలంటే.. కుదరడం లేదు... రామా.. కనవేమిరా?

అయోధ్యలో రామమందిర నిర్మాణం ఈ నెల 22వ తేదీన జరగనుంది. అయితే అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.

Update: 2024-01-08 05:30 GMT

అయోధ్యలో రామమందిర నిర్మాణం ఈ నెల 22వ తేదీన జరగనుంది. అయితే అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒకప్పుడు కుగ్రామంగా ఉండే అయోధ్య ఇప్పుడు ప్రపంచం దృష్టిలో పడింది. ఆధ్యాత్మిక నగరంగా మాత్రమే కాకుండా పర్యాటక రంగంగా కూడా ప్రభుత్వం తీర్చి దిద్దుతుంది. అయోధ్యలో టెంపుల్ సిటీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తుంది. 38 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. మౌలిక సదుపాయాలను కల్పించడంలో భాగంగా అనేక సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. అంతర్జాతీయ ఎయిర్ పోర్టుతో పాటు అత్యాధునిక రైల్వే స్టేషన్ కూడా రూపుదిద్దుకుంది. స్మార్ట్ సిటీగా మార్చనున్నారు.

భూముల ధరలకు బూమ్...
దీంతో అయోధ్యలో భూమి ధరలకు భూమ్ వచ్చింది. ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. భవిష‌్యత్ అంతా అయోధ్య అని భావించి రియల్టర్లు అయోధ్యకు క్యూ కడుతున్నారు. ఎకరాల కొద్దీ భూములను కొనుగోలు చేస్తున్నారు. ప్లాట్లుగా చేసి వాటి విక్రయాలు కూడా మొదలు పెట్టనున్నారని తెలిసింది. అయోధ్యలో ఇప్పుడు భూమిని కొనుగోలు చేయడం ఆషామాషీ కాదు. మొన్నటి వరకూ ఒక ధర.. నేడు మరొక ధర. కనీసం గజం ఐదు వేలు కూడా పలకని ధర నేడు లక్షలకు చేరింది. అత్యంత లాభదాయకమైన వ్యాపారం అయోధ్యలోనే జరుగుతుందని రియల్టర్లు భావించి ఇక్కడ భూములను కొనుగోలు చేసి బోర్డులను పెట్టేస్తున్నారు.
అన్ని రకాల వసతులు...
స్టార్ హోటళ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. అయోధ్యకు కోట్లాది మంది వస్తారన్న అంచనాలతో ఇప్పటికే అనేక హోటళ్లు వెలిశాయి. పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాలు జరుగుతున్నాయి. దేశంలో పేరెన్నికిగన్న సంస్థలన్నీ అయోధ్యలో అడుగుపెట్టాయి. భూముల ధరలు నాలుగు రెట్లు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. చదరపు అడుగు 2019 వెయ్యి నుంచి రెండు వేల రూపాయలుండగా నేడు నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు చేరుకుంది. దీంతో అయోధ్యలో భూమిని కొనుగోలు చేయడం సాధ్యం కాని పని అయింది. ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రధాన నగరాలతో పోలిస్తే భారీగా భూముల ధరలు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు.



Tags:    

Similar News