Back To Prison: మా అన్న జైలు నుండి బయటకు వచ్చాడంటూ ఓవరాక్షన్.. చివరికి
అన్న కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ అతడి అనుచరులు సోషల్ మీడియాలో
క్రిమినల్స్ ను కూడా గొప్ప వ్యక్తులు అంటూ ఆరాధించే జనం మన దేశంలో ఉన్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు జైలు నుండి బయటకు వస్తే.. అదేదో స్వాతంత్ర్యపోరాటం చేసిన వ్యక్తులు బయటకు వచ్చినట్లుగా ఫీల్ అవుతాం. మా అన్న జైలు నుండి బయటకు వచ్చాడహో అంటూ తెగ సంబరపడిపోతూ ఉంటారు. అలా జైలు నుండి బయటకు వచ్చిన ఓ వ్యక్తి అనుచరులు చేసిన ఓవరాక్షన్ కు.. తిరిగి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే పంపించారు పోలీసులు.
మహారాష్ట్రలో ఒక గ్యాంగ్‌స్టర్ ఇటీవల జైలు నుండి విడుదలయ్యాడు. అతనిపై హత్యాయత్నం, దొంగతనం, హింసతో సహా అనేక పోలీసు కేసులు నమోదయ్యాయి. అతడు విడుదలైనప్పుడు ఓ ర్యాలీగా ఇంటికి తీసుకుని వెళ్లారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తిరిగి అతడిని జైలుకు పంపారు. నాసిక్‌లోని గ్యాంగ్‌స్టర్ హర్షద్ పాటంకర్‌పై MPDA చట్టం కింద జైలు శిక్ష విధించారు. అతను జూలై 23న జైలు నుండి బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతని మద్దతుదారులు కారు ర్యాలీ చేపట్టారు. బేతేల్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన ర్యాలీలో పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు కూడా పాల్గొన్నాయి. వైరల్ వీడియోలలో, కారు సన్‌రూఫ్ నుండి బయటకు వచ్చి పాటంకర్ తన మద్దతుదారుల వైపు చూసి చేతులు ఊపడం మనం చూడవచ్చు.
అన్న "కమ్ బ్యాక్" ఇచ్చాడంటూ అతడి అనుచరులు సోషల్ మీడియాలో ర్యాలీకి సంబంధించిన విజువల్స్ ను పంచుకున్నారు. అయితే రీల్స్ ను చూసిన పోలీసులు మరోసారి అతడిపై చర్యలు తీసుకున్నారు. అనధికారిక ర్యాలీని నిర్వహించి గందరగోళం సృష్టించినందుకు పాటంకర్‌ను, అతని ఆరుగురు సహాయకును మళ్లీ అరెస్టు చేశారు.