BRS : మేలుకుంటే మేలు... లేకుంటే అసలుకే ఎసరు... గ్రౌండ్ లెవెల్ లో సిట్యుయేషన్ ఇదే బాసూ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ఇంటికే పరిమితమయ్యారు. నేతలు మాత్రం తమ దారి తాము చూసుకుంటున్నారు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ఫాం హౌస్ కే పరిమితయ్యారు. ఆయన పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల్లోకి రావడం మానేశారు. దీంతో కార్యకర్తలు డీలా పడిపోయారు. నేతలు కూడా వెళ్లిపోతున్నారు. తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారిపోయారు. మరికొంతమంతి లైన్ లో ఉన్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీ లోకి రప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంతో కేసీఆర్ ఇప్పుడు అన్ని రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు తన కుమార్తెను తీహార్ జైలు నుంచి బయటకు రప్పించడం ఆయనకు ఒక సవాల్ గా మారింది. అదే సమయంలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కూడా తన మెడకు చుట్టుకునేలా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన జనంలోకి వచ్చి జరిగిన విషయాలను చెప్పాలని క్యాడర్ కోరుకుంటుంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత...
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత డీలాపడినా తర్వాత పార్లమెంటు ఎన్నికల సమయానికి జనంలోకి కేసీఆర్ వచ్చారు. కేసీఆర్ బస్సు యాత్రకు భారీగానే జనం హాజరయ్యారు. కార్యకర్తల్లోనూ జోష్ పెరిగింది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ కు దక్కలేదు.లోక్‌సభలో బీఆర్ఎస్ పాత్ర లేకుండా ఈ ఎన్నికలు చేయడంతో కేసీఆర్ మరింత డీలా పడినట్లు తెలుస్తుంది. ఆయన ఎన్నికల ఫలితాల ముందు ఒకసారి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం తిరిగి దూరంగానే ఉన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో క్యాడర్ డీలా పడింది. రాష్ట్ర నాయకత్వమే ఇలా ఉంటే ఇక నియోజకవర్గాల్లో తాము ఎలా పనిచేస్తామంటున్నారు నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు లు బయటకు వచ్చి కొంత హడావిడి చేస్తున్నప్పటికీ కేసీఆర్ క్షేత్ర స్థాయిపర్యటనలకు రావాలని క్యాడర్ బలంగా కోరుకుంటుంది. క్యాడర్ లో భరోసా నింపేందుకు ఆయన గ్రౌండ్ లెవెల్లో పర్యటనలు చేస్తేనే ఉపయోగం ఉంటుందంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు...
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అధికార పార్టీగా ఊపు మీద ఉంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచి గ్రామ స్థాయిలో ఆ పార్టీ వేళ్లూనుకుంటుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతూ వస్తుంది. ఈ రెండు పార్టీలూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖాముఖి తలపడే అవకాశం ఇవ్వవద్దన్నది నేతల మాటగా వినిపిస్తుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో నాయకత్వం బలంగా ఉంటేనే వచ్చే ఏ ఎన్నికల్లోనైనా సులువుగా ఎదుర్కొనగలమని చెబుతున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి పక్షం రోజులు గడుస్తున్నా క్యాడర్ కు భరోసా నిస్తూ, ధైర్యంచెప్పే మాటలు మాత్రం కేసీఆర్ చేయలేెకపోయారు. ప్రజా సమస్యలపై నేరుగా కేసీఆర్ క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగితేనే కొంత ఫలితం ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
తీరు మార్చుకోకుంటే...
కేసీఆర్ తీరు మార్చుకోకుంటే పార్టీకి భవిష్యత్ లోనూ గడ్డుకాలం తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే గతపార్లమెంటు ఎన్నికల సమయంలోనే కొందరు గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలు కారు పార్టీని వదిలి బీజేపీ పంచన చేరిపోయారు. అక్కడయితే సురక్షితంగా ఉంటుందని భావించడమే ఇందుకు కారణం. కొందరు కాంగ్రెస్ వైపు వెళ్లగా, మరికొందరు కమలం పార్టీ వైపు వెళ్లిపోయారు. కేసీఆర్ తీరు ఇలాగే కొనసాగితే పార్టీ కి ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలు గ్రామాల నుంచి వినిపిస్తున్నాయి. మరి ఈ హెచ్చరికలు గులాబీ బాస్ చెవికెక్కుతాయా? లేక ఎన్నికల సమయానికి చూసుకుందాంలే అని ఎప్పటిలాగే ఇంటికే పరిమితమవుతారా? అన్నది మాత్రం ఆయనే తేల్చుకోవాల్సి ఉంది. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం పెట్టుకున్న నాయకత్వం మరింత సంఖ్యలో పార్టీని వదలి వెళ్లకముందే ఆయన మేలుకుంటే మేలని గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.