Telangana : బీఆర్ఎస్ కు భారీ నష్టం.. కోలుకుంటుందా? తేరుకుంటుందా?
తెలంగాణలో బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది. గతంలో ఎన్నడూ ఏ ఎన్నికల్లో జరగని అవమానం మిగిలింది
తెలంగాణలో బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది. గతంలో ఎన్నడూ ఏ ఎన్నికల్లో జరగని అవమానం మిగిలింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దో గొప్పో ఓట్ల శాతాన్ని తెచ్చుకున్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. జనం రావడానికి.. ఓట్లు పడటానికి సంబంధం లేదని తేలిపోయింది. కేసీఆర్ బస్సు యాత్రకు పెద్దయెత్తున జనం రావడంతో కనీస స్థానాల్లో అయినా కారు పార్టీ విజయం సాధిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ ఇంత దారుణమైన ఓటమి ఉంటుందని కేసీఆర్ కూడా కలలో ఊహించి ఉండరు. ఒక్క చోట కూడా ఆ పార్టీ గెలవలేదంటే ప్రజలు ఆ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారనే చెప్పాలి.
ఓటు బ్యాంకు ...
బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీకి బదిలీ అయిందనే చెప్పాలి. మొత్తం పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలున్న తెలంగాణలో ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ అది విజయాన్ని అందుకోలేకపోయింది. కాంగ్రెస్, బీజేపీ పోటా పోటీగా చెరి ఎనిమిది స్థానాల్లో గెలిచాయి. ఒక స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది. కానీ ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ మాత్రం ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ గెలవలేకపోవడం అంటే ఆ పార్టీ పట్ల ప్రజలు ఇంకా విముఖతతోనే ఉన్నారని అర్థమవుతుంది. ఈ ఎన్నికలలో కనీస స్థానాలను గెలుచుకుంటామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నమ్మకంతో ఉన్నారు. తన పర్యటనకు సంబంధించి వచ్చిన స్పందన చూసి కొన్ని స్థానాలైనా గెలుచుకుంటామని అనుకున్నారు.
అనూహ్యంగా...
కానీ బీజేపీ అనూహ్యంగా తెలంగాణలో పుంజుకుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాలకే పరిమితమయిన పార్టీ ఇప్పుడు ఎనిమిది స్థానాలను గెలుచుకోవడం అంటే ఆషామాషీ అయిన విషయం కాదు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వారిలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డితో పాటు మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ లో ీకే అరుణ తో సహా ఎనిమిది మంది విజయం సాధించారు. కాంగ్రెస్ కూడా గత పార్లమెంటు ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితమయింది. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా అది ఎనిమిది స్థానాల్లో గెలిచింది. దీంతో తెలంగాణలో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే జరిగింది. బీఆర్ఎస్ ఎక్కడా కనిపించకుండా పోయింది.