ఖమ్మం.. సభ.. ఎలా ఉండనుందంటే?
జాతీయ రాజకీయాల్లో ముఖ్య భూమికను పోషించేందుకు బీఆర్ఎస్ ఖమ్మం బహిరంగ సభను ఉపయోగించుకుంటుంది
జాతీయ రాజకీయాల్లో ముఖ్య భూమికను పోషించేందుకు బీఆర్ఎస్ ఖమ్మం బహిరంగ సభను ఉపయోగించుకుంటుంది. ఇందుకోసం 16 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ఐదు లక్షల మంది బహిరంగ సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దేశస్థాయిలో చర్చించుకునే విధంగా ఖమ్మం సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే.
పెద్దయెత్తున జనసమీకరణ...
దీంతో పెద్దయెత్తున జనసమీకరణకు నేతలు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీగా జనాన్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వంద ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. విడిగా పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం 448 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు ఈ సభకు హాజరవుతున్నారు.