ఖమ్మం సభ ప్రతిష్టాత్మకమే

ఖమ్మంలో సభకు ఐదు లక్షల మంది వచ్చేలా ప్లాన్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

Update: 2023-01-10 03:03 GMT

ఖమ్మంలో సభకు ఐదు లక్షల మంది వచ్చేలా ప్లాన్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయిన ఆయన ఈ నెల 18న బీఆర్ఎస్ సభపై సమీక్షించారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలన్న దానిపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. తొలుత బీఆర్ఎస్ సభను ఢిల్లీలో నిర్వహించాలని భావించినా, ఖమ్మంలో నిర్వహించేందుకు కేసీఆర్ మొగ్గు చూపారు. బీఆర్ఎస్ ను ప్రకటించిన తర్వాత ఏర్పాటు చేస్తున్న తొలి సభ కావడంతో పూర్తిగా సక్సెస్ చేసే బాధ్యతను ఆ ప్రాంత మంత్రులు, నేతలపై కేసీఆర్ ఉంచారు.

ఐదు లక్షల మందిని...
ఈ సభ గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా నిర్వహించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గం నుంచి ముప్ఫయి నుంచి నలభై వేల మందిని సమీకరించాలని ఆదేశించారు. సభ నిర్వహణ బాధ్యతను మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్ రెడ్డిలకు అప్పగించారు. ముందుగానే అక్కడకు వెళ్లి అన్ని ఏర్పాట్లు చూడాలని ఇద్దరు మంత్రులను ఆదేశించారు. ఖమ్మం సభను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు జనసమీకరణపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.


Tags:    

Similar News