మేం చేయాలనుకుంటే దుమ్మురేగిపోతుంది : కేసీఆర్
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి అమానుషమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి అమానుషమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికలు ఎదుర్కొనలేని చేతకాని దద్దమ్మ పార్టీలు, చేతగాని వాళ్లు ఈరోజు దాడి చేశారని ఆయన అన్నారు. బాన్సువాడ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. జుక్కల్లో ఉన్నప్పుడే తనకు ఈ వార్త వచ్చిందని, అయితే ఆయనకు ప్రాణాపాయం లేదని మంత్రులుత చెప్పడంతో వెళ్లడం ఆగిపోయానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇదా రాజకీయం? ఇదేం అరాచకం? మేం చేయాలనుకుంటే దుమ్ము రేగిపోతుందని కేసీఆర్ ఫైర్ అయ్యారు.
ఆందోళనలకు గురికావద్దు...
మరోవైపు దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పై దాడిని మంత్రి హరీశ్ రావు ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు, హింసకు తావు లేదని ఆయన అన్నారు. ఈ ఘటనను బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ప్రభాకర్రెడ్డికి మెరుగైన చికత్స అందించేందుకే హైదరాబాద్ తరలించడం జరిగిందని తెలిపారు. ప్రభాకర్ రెడ్డి కడుపులో గాయాలయ్యాయన్న హరీశ్ రావు ఎవరూ ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని పిలుపు నిచ్చారు. ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఆయనపై జరిగిన హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉదా? అని అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని తెలిపారు.